అంతర్జాతీయ మార్గాల్లో జాగ్రత్త

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, నష్టభయాలను సొంతంగా మదింపు చేసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది.

Published : 17 Apr 2024 01:53 IST

దేశీయ విమానయాన కంపెనీలకు కేంద్రం సూచన
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యం

దిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా, నష్టభయాలను సొంతంగా మదింపు చేసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలని దేశీయ విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. ఇప్పటికే ఎయిరిండియా, విస్తారా, ఇండిగో తదితర అంతర్జాతీయ విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. ఇరాన్‌ గగనతలంపైకి తమ విమానాలు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తున్నాయి. ఎయిరిండియా అయితే టెల్‌అవివ్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో తాజా సూచనలు వెలువడ్డాయి. విమానయాన సంస్థలతో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోనూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తోందని పౌర విమానయాన శాఖ తెలిపింది.

ఇంధన వ్యయాలు పెరగొచ్చు: ఇక్రా

అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరేందుకు, ప్రత్యామ్నాయ మార్గాల్లో, విమానాలు అదనపు దూరం ప్రయాణిస్తున్నందున, నిర్దేశిత సమయం కంటే మరో అరగంట ఎక్కువ పడుతోంది. ఇందువల్ల విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) రూపంలో విమానయాన కంపెనీలకు వ్యయాలు పెరుగుతున్నాయని ఇక్రా తెలిపింది. మనదేశం నుంచి ఐరోపా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా నగరాలకు వెళ్లే, వచ్చే విమానాలకు అధిక వ్యయాలు అవ్వొచ్చని పేర్కొంది. దీని వల్ల టికెట్ల ధరలు పెరుగుతాయి. వేసవి సెలవుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం పడొచ్చని అంచనా వేస్తోంది. గత వారాంతంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డజన్లకొద్దీ డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించగా.. అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని