సంక్షిప్త వార్తలు

హైదరాబాద్‌కు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఫొటోవోల్టాయిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 140 మెగావాట్ల సొలార్‌ పీవీ (ఫొటో వోల్టాయిక్‌) మాడ్యూల్స్‌ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది.

Updated : 18 Apr 2024 02:26 IST

ప్రీమియర్‌ ఎనర్జీస్‌కు పీవీ మాడ్యూల్స్‌ ఎగుమతి కాంట్రాక్టు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఫొటోవోల్టాయిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 140 మెగావాట్ల సొలార్‌ పీవీ (ఫొటో వోల్టాయిక్‌) మాడ్యూల్స్‌ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బంగ్లాదేశ్‌లో చేపట్టిన సోలార్‌ ఈపీసీ ప్రాజెక్టుకు ఈ మాడ్యూల్స్‌ ఎగుమతి చేయనున్నట్లు ప్రీమియర్‌ ఎనర్జీస్‌ వెల్లడించింది. 2025 ఏప్రిల్‌ నాటికి పీవీ మాడ్యూల్స్‌ ఎగుమతిని పూర్తి చేయాల్సి ఉంది. ఈ కాంట్రాక్టుతో తమ పీవీ మాడ్యూల్స్‌ నాణ్యత, సామర్థ్యానికి గుర్తింపు వచ్చిందని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఎండీ ఎస్‌.చిరంజీవి పేర్కొన్నారు.


ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ రూ.1,272 కోట్ల రైట్స్‌ ఇష్యూ

దిల్లీ: రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,271.83 కోట్ల వరకు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ బుధవారం ప్రకటించింది. రైట్స్‌ ఇష్యూలో ఒక్కో షేరును రూ.300 చొప్పున కేటాయించనుంది.  రైట్స్‌ ఇష్యూలో భాగంగా 4,23,94,270 ఫుల్లీ పెయిడప్‌ ఈక్విటీ షేర్లను వాటాదార్లకు కేటాయించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ఏప్రిల్‌ 23ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్‌ 30 నుంచి మే 14 మధ్య ప్రస్తుత వాటాదార్లు,  ఈ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వాటాదార్లకు ఉన్న ప్రతి 9 షేర్లకు ఒక రైట్స్‌ ఇష్యూ షేరు జారీచేసే అవకాశం ఉంది.


సౌర సొల్యూషన్ల రంగంలోకి యాపిల్‌

దిల్లీ: భారత్‌లో సోలార్‌ సొల్యూషన్స్‌ అందించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్‌మ్యాక్స్‌తో సంయుక్త సంస్థను ఐఫోన్‌ తయారీదారు యాపిల్‌ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 6 పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్‌ల రూఫ్‌టాప్‌ సోలార్‌ ఇన్‌స్టాలేషన్‌లను ఈ సంయుక్త సంస్థ అమర్చింది.


దైమ్లర్‌ ఇండియా నుంచి ఇక్యాంటర్‌

దిల్లీ: దేశీయంగా విద్యుత్‌ విభాగంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ (డీఐసీవీ) వెల్లడించింది. ఆల్‌-ఎలక్ట్రిక్‌ తదుపరి తరం తేలికపాటి ట్రక్‌ ఇక్యాంటర్‌ను వచ్చే 6-12 నెలల్లో విడుదల చేస్తామని పేర్కొంది. 2022 ద్వితీయార్ధంలో జపాన్‌, ఐరోపాల్లో ఇక్యాంటర్‌ను ప్రదర్శించారు. ‘మా మొత్తం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కర్బన రహితం చేసే దీర్ఘకాలిక వ్యూహానికి తొలి అడుగులు వేయబోతున్నాం. ఇందులో భాగంగా 6-12 నెలల్లో ఇక్యాంటర్‌ను విపణిలోకి తీసుకొస్తామ’ని డీఐసీవీ ఎండీ, సీఈఓ సత్యకామ్‌ ఆర్య వెల్లడించారు.


జీల్‌లో నాలుగు కీలక విభాగాలు

దిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీల్‌) తన సంస్థాగత నిర్మాణాన్ని సవరించింది. ఎండీ, సీఈఓ పునీత్‌ గోయెంకా ఇకపై దేశీయ బ్రాడ్‌క్యాస్ట్‌ వ్యాపారం సహా కీలక విభాగాలకు నేరుగా నేతృత్వం వహిస్తారని సంస్థ బుధవారం ప్రకటించింది. బోర్డు అంగీకరించిన కొత్త సంస్థాగత నిర్మాణం ప్రకారం.. జీల్‌లో బ్రాడ్‌క్యాస్ట్‌, డిజిటల్‌, సినిమాలు, సంగీతం అనే నాలుగు కీలక వ్యాపార విభాగాలుంటాయి. పునీత్‌ గోయెంకా సోదరుడు అమిత్‌ గోయెంకా ప్రస్తుతం డిజిటల్‌ వ్యాపారానికి అధిపతిగా ఉండగా.. ఇంటర్నేషనల్‌ బ్రాడ్‌క్యాస్ట్‌, ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీ, బ్రాడ్‌క్యాస్ట్‌ కార్యకలాపాలు, ఇంజినీరింగ్‌ విభాగాల అదనపు బాధ్యతలూ చేపడతారు. దేశీయ బ్రాడ్‌క్యాస్ట్‌ వ్యాపారంలో ప్రస్తుతం దక్షిణ ఛానళ్ల క్లస్టర్లకు అధిపతిగా ఉన్న సిజు ప్రభాకరన్‌ పశ్చిమ క్లస్టర్‌ బాధ్యతలూ తీసుకుంటారు.  తూర్పు క్లస్టర్‌ అధిపతి సామ్రాట్‌ ఘోష్‌ ఇక నుంచి ఉత్తర, ప్రీమియం క్లస్టర్ల అదనపు బాధ్యతలు తీసుకుంటారు. ఇలా పలు మార్పులను కంపెనీ చేపట్టింది.


అంబుజా సిమెంట్స్‌లో అదానీ మరో రూ.8,339 కోట్ల పెట్టుబడి
70.3 శాతానికి పెరిగిన వాటా

దిల్లీ: అంబుజా సిమెంట్స్‌లో గౌతమ్‌ అదానీ కుటుంబం అదనంగా రూ.8,339 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో కంపెనీలో వారి వాటా మరో  3.6% పెరిగి 70.3 శాతానికి చేరింది. ఇంతకుమునుపు 2022 అక్టోబరు 18న రూ.5000 కోట్లు, 2024 మార్చి 28న రూ.6,661 కోట్ల మేర నిధులను అంబుజా సిమెంట్స్‌లో అదానీ కుటుంబం పెట్టుబడిగా పెట్టింది. తాజా పెట్టుబడితో రూ.20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను పూర్తి చేసినట్లు అయ్యింది. అంబుజా సిమెంట్స్‌లో 63.2 శాతంగా ఉన్న అదానీల వాటా, ఈ రూ.20,000 కోట్ల పెట్టుబడితో 70.3 శాతానికి పెరిగింది. గత డిసెంబరు 31 నాటికి 76.1 మిలియన్‌ టన్నులుగా ఉన్న సంస్థ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 2028 కల్లా దాదాపుగా రెట్టింపు చేసి, 140 మిలియన్‌ టన్నులకు చేర్చాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ పెట్టుబడులు అంబుజా సిమెంట్స్‌కు ఉపయోగపడనున్నాయి. ‘అంబుజాలో అదానీ కుటుంబం రూ.20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను పూర్తి చేసినట్లు ప్రకటించడం ఆనందంగా ఉంద’ని అంబుజా సిమెంట్స్‌ సీఈఓ అజయ్‌ కపూర్‌ తెలిపారు.


నేటి బోర్డు సమావేశాలు: ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, నెట్‌వర్క్‌ 18, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, ఓరియెంట్‌ హోటల్స్‌


బుధవారం మార్కెట్లు పనిచేయలేదు: శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లు పనిచేయలేదు. మనీ, బులియన్‌, డెరివేటివ్‌ మార్కెట్లకు కూడా సెలవే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని