స్మాల్‌క్యాప్‌ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు

గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్‌ క్యాప్‌) మ్యూచువల్‌ఫండ్ల (ఎంఎఫ్‌) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది.

Published : 18 Apr 2024 02:16 IST

2023-24లో 83% వృద్ధి

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్‌ క్యాప్‌) మ్యూచువల్‌ఫండ్ల (ఎంఎఫ్‌) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి నాటి రూ.1.33 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 83% అధికం. చిన్న మదుపర్ల నుంచి భాగస్వామ్యం పెరగడం, స్టాక్‌ మార్కెట్ల రాణింపు ఇందుకు దోహదం చేశాయి. మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాల సంఖ్య పెరగడమూ మరో కారణం. 2023 మార్చి ఆఖరుకు ఖాతాల సంఖ్య 1.09 కోట్లుగా ఉండగా.. 2024 మార్చికి 1.9 కోట్లకు చేరింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అంచనాలు ఆకర్షణీయ స్థాయిలో ఉండటం.. పలు చిన్న తరహా కంపెనీలు స్టాక్‌ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణకు మొగ్గు చూపడానికి దారి తీస్తోందని ఫైయర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చ్‌) గోపాల్‌ కావలిరెడ్డి తెలిపారు. అయితే సార్వత్రిక ఎన్నికలు, వర్షపాత అంచనాలు, ద్రవ్యోల్బణం, జీడీపీ అంచనాలు, 2024-25 కార్పొరేట్‌ ఆదాయాల వృద్ధి లాంటివి చిన్న తరహా కంపెనీల విలువలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు.

మార్చిలో మారిన పరిస్థితి..: 2023-24లో చిన్న తరహా ఫండ్‌ పథకాల్లోకి రూ.40,188 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.22,103 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. అయితే ఈ ఏడాది మార్చిలో ఈ ఫండ్‌ పథకాల నుంచి నికరంగా రూ.94 కోట్లు వెనక్కి తీసుకున్నారు. గత కొన్ని త్రైమాసికాలుగా స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ పథకాల్లో అసాధారణ స్థాయిలోకి పెట్టుబడులు రావడంపై సెబీ ఆందోళన వ్యక్తం చేయడం ఇందుకు కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు