యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే, గూగుల్‌పే వాటా 86%

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) విభాగంలో ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్‌టెక్‌ అంకుర సంస్థలతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Published : 18 Apr 2024 02:17 IST

ఆధిపత్య నియంత్రణపై ఎన్‌పీసీఐ దృష్టి
దేశీయ ఫిన్‌టెక్‌ అంకురాలతో సమావేశం

దిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) విభాగంలో ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్‌టెక్‌ అంకుర సంస్థలతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ లావాదేవీల సంఖ్యలో గూగుల్‌ పే, ఫోన్‌పే సంస్థల వాటాయే సుమారు 86% వరకు ఉంటోంది. నేపాల్‌, సింగపూర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనూ యూపీఐ చెల్లింపుల కోసం పలు ఒప్పందాలపై ఫోన్‌పే సంతకాలు చేసింది. అంతర్జాతీయ చెల్లింపుల కోసం యూపీఐ వినియోగించేందుకు, ఎన్‌పీసీఐతో గూగూల్‌ పే కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూపీఐ లావాదేవీల విషయంలో పేటీఎం మార్కెట్‌ వాటా తగ్గుతోంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆంక్షలు ఇందుకు ఓ కారణం.

యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్‌ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. క్రెడ్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఫామ్‌పే, అమెజాన్‌ సహా ఇతర ఫిన్‌టెక్‌ సంస్థల ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆ సంస్థల ప్రతినిధులతో ఎన్‌పీసీఐ అధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీల పురోగతికి ఎలాంటి సహకారం అందించాలనే విషయంపై ఓ అవగాహనకు వచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

30% పరిమితి సాధ్యమా?: యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్‌ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్‌పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. యూపీఐ విభాగంలో కొత్త సంస్థలకు మరింత అనుకూల  పరిస్థితులను సృష్టించే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. యూపీఐ లావాదేవీలను పెంచుకునేందుకు వినియోగదార్లకు ప్రోత్సాహకాలు అందించేలా ఫిన్‌టెక్‌ కంపెనీలను ఎన్‌పీసీఐ సూచనలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని