యువశక్తి సద్వినియోగం ఏదీ?

దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ ఆక్షేపించారు.

Published : 18 Apr 2024 02:18 IST

ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువ మంది ఆసక్తి
రైల్వేలో ప్యూన్‌ ఉద్యోగాలకూ పీహెచ్‌డీల దరఖాస్తు
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌

వాషింగ్టన్‌: దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ ఆక్షేపించారు. నిరుద్యోగ సమస్య దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోందని, యువత నైపుణ్యాలు పెంచి, వారికి ఉపాధి చూపకపోతే.. పరిస్థితులు ఇబ్బందికరంగా మారొచ్చనే అంచనాను వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారని, పీహెచ్‌డీ చేసిన వారు సైతం రైల్వేలో ప్యూన్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రైవేటు రంగంలోనూ తగిన ఉద్యోగాలు లభించకపోవడమే ఇందుకు కారణమన్నారు. జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో ‘మేకింగ్‌ ఇండియా యాన్‌ అడ్వాన్స్‌డ్‌ ఎకానమీ బై 2047’ అంశంపై నిర్వహించిన సదస్సులో రఘురామ రాజన్‌ మాట్లాడారు.

యువశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో భారత్‌ మధ్య స్థాయిలోనే ఉందని, ఈ విషయంలో చైనా, కొరియా వంటి దేశాలు అధిక ప్రతిఫలాన్ని పొందాయని గుర్తు చేశారు. యువతలో నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాలని సూచించారు.

అప్రెంటిస్‌షిప్‌ మంచి ఆలోచన: మన మానవ వనరుల సామర్థ్యాలను కొంతైనా మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న ఉద్యోగాల స్వభావాన్ని పాక్షికంగా మార్చడం వంటి అంశాలపైనా పని చేయాలని రఘురామ రాజన్‌ పేర్కొన్నారు. ‘నైపుణ్యాల పెంపునకు అప్రెంటిస్‌షిప్‌ మంచి ఆలోచన. కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశాన్ని తన ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. ఈ ఆలోచనను ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది’ అని రాజన్‌ అభిప్రాయపడ్డారు. చిప్‌ పరిశ్రమ కోసం రూ.వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న ప్రభుత్వాలు, అత్యధికులకు ఉపాధి కల్పించే తోలు రంగం వంటి వాటిపై శీతకన్ను వేస్తున్నాయని వివరించారు. మన దేశానికి చెందిన చాలా మంది ఆవిష్కర్తలు, సింగపూర్‌, సిలికాన్‌ వ్యాలీ వంటి ప్రాంతాలకు వెళ్లి, అక్కడ సంస్థలు స్థాపించేందుకు, ‘తుది వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకే’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని రాజన్‌ తెలిపారు. చాలా మంది భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రపంచాన్ని మార్చాలన్న దృక్పథంతో ఉంటున్నారని, కానీ వారు దేశీయంగా ఉండటానికి ఇష్టపడటం లేదన్నారు. యువ భారత్‌ మనస్తత్వాన్ని విరాట్‌ కోహ్లీతో రాజన్‌ పోల్చారు. ప్రపంచంలో ఎవరికంటే తాము తీసిపోమనే దృక్పథంతో ఉంటున్నారని ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని