10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు

దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

Published : 18 Apr 2024 02:19 IST

స్థిరాస్తి డెవలపర్లకు మంచి అవకాశం
సీబీఆర్‌ఈ వెల్లడి

దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. 2050 కల్లా ప్రపంచంలోని వయోవృద్ధుల్లో భారత్‌లోనే 17% మంది ఉంటారని అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశంలో వీరి సంఖ్య 15 కోట్లుగా ఉండగా.. వచ్చే 10-12 ఏళ్లలో 23 కోట్లకు చేరొచ్చని ‘గోల్డెన్‌ ఆపర్చునిటీస్‌ ఫ్రం ద సిల్వర్‌ ఎకానమీ’ నివేదికలో పేర్కొంది. అందులో భారత్‌లో ‘సీనియర్‌ కేర్‌’ భవితవ్యంపై విశ్లేషించింది.

ఇన్ని రకాలుగా: సీనియర్‌ సిటిజన్లు ఉండడానికి, వారికి తగిన సేవలు అందించడానికి వీలు కల్పించే సీనియర్‌ లివింగ్‌ విభాగంలో.. ఇండిపెండెంట్‌ లివింగ్‌ కమ్యూనిటీలు, అసిస్టెడ్‌ లివింగ్‌ ఫెసిలిటీలు, మెమొరీ కేర్‌ యూనిట్లు, కంటిన్యూయింగ్‌ కేర్‌ రిటైర్‌మెంట్‌ కమ్యూనిటీలు ఉంటాయి. ఈ తరహా వయోవృద్ధుల నిర్మాణాలు 2024లో 10 లక్షల వరకు చేరొచ్చని అంచనా. ఇవి మరో 10 ఏళ్లలో 25 లక్షలకు చేరొచ్చు. అంటే అదనంగా 15 లక్షల వసతులను నిర్మించాల్సి రావొచ్చు. భారత్‌లో సీనియర్‌ లివింగ్‌ యూనిట్ల వ్యాప్తి రేటు 1 శాతంగా ఉండగా.. బ్రిటన్‌లో 11%, ఆస్ట్రేలియాలో 6.7%, అమెరికాలో 6 శాతంగా ఉంది. ఈ విభాగంలో భారత స్థిరాస్తి డెవలపర్లకు అపార అవకాశాలున్నాయి.

దక్షిణ భారత్‌లోనే అధికం..

భారత్‌లోని 70% వయోవృద్ధుల్లో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, కంటిచూపు సంబంధిత రోగాలు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ముఖ్యంగా దక్షిణ భారత్‌లో సీనియర్‌ లివింగ్‌ సదుపాయాలపై డెవలపర్లు ఆసక్తిగా ఉన్నారు. మొత్తం సంస్థాగత సీనియర్‌ లివింగ్‌, కేర్‌ విభాగంలో దక్షిణ భారత్‌ వాటా 62 శాతంగా ఉంది. ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే ఒంటరిగా నివసించడానికి ఇష్టపడే వయోవృద్ధుల సంఖ్య అధికంగా ఉండడం, అత్యంత అందుబాటు ధరలో వసతులు ఉండడం, చిన్న కుటుంబాల వైపు అందరూ మొగ్గుచూపుతుండడం వంటి కారణాలతో దక్షిణ భారత్‌లో ఈ నివాసాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ ప్రాంతంలో సుశిక్షితులైన సిబ్బంది లభ్యత అధికంగా ఉండడం, ఆరోగ్య సంక్షరణ వసతులు మెరుగ్గా ఉండడంతో వీరి సంరక్షణకు నాణ్యమైన సేవలు అందుతున్నాయి.


ఈ నగరాల్లో సేవలు

చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరుకు చెందిన ప్రధాన కంపెనీలు ఈ విభాగాల్లో సేవలందించడానికి ఆసక్తిగా ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, కోయంబత్తూరు, పుణె, దిల్లీలలో సీనియర్‌ కేర్‌ యూనిట్ల విస్తరణపై కంపెనీలు దృష్టి  సారిస్తున్నాయి. అన్ని వసతులూ ఒక దగ్గర ఉండేందు కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాలూ కుదుర్చుకుంటున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని