భారత వృద్ధి 6.5 శాతం

భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది.

Published : 18 Apr 2024 02:19 IST

2024పై ఐక్యరాజ్యసమితి నివేదిక

ఐక్యరాజ్యసమితి: భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. 2024లో 6.8%, 2025లో 6.5% మేర భారత్‌ వృద్ధి నమోదు చేస్తుందని మంగళవారం విడుదలైన ఐఎమ్‌ఎఫ్‌ నివేదిక అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం..

  • 2023లో భారత్‌ 6.7% వృద్ధిని నమోదు చేసింది. 2024లో అది 6.5% వృద్ధిని నమోదు చేయొచ్చు. తద్వారా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి గల ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగగలదు.
  • 2023లో బలమైన ప్రభుత్వ పెట్టుబడుల కేటాయింపులకు తోడు సేవల రంగం రాణించింది. వినియోగదార్లకు స్థానికంగా బలమైన గిరాకీ లభించడం, వ్యాపార సేవల ఎగుమతులకు బయటి దేశాల నుంచి గిరాకీ కొనసాగడంతో మంచి వృద్ధి సాధ్యమైంది. ఈ అంశాలు 2024లోనూ మద్దతుగా నిలిచి, వృద్ధి కారకాలుగా నిలవగలవు.
  • స్వల్పకాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచొచ్చని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పెట్టుబడుల వ్యయాలు భారీగా కనిపించొచ్చు.
  • ఇతర దక్షిణాసియా దేశాలైన బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలలో వృద్ధి అత్యంత స్తబ్దుగా ఉండొచ్చు.

వరుసగా మూడో ఏడాదీ ‘అంతర్జాతీయం’ వెనకడుగే: అంతర్జాతీయ వృద్ధి 2024లో 2.6 శాతంగా నమోదవ్వొచ్చు. 2023 నాటి 2.7 శాతంతో పోలిస్తే ఇది కాస్తంత తక్కువ. కరోనాకు ముందు అంటే 2015-19 సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు 3.2% నమోదైంది. దీంతో వరుసగా మూడో ఏడాదీ అంత కంటే తక్కువ వృద్ధి నమోదుకానుంది. చైనా, భారత్‌, ఇండోనేషియా, రష్యన్‌ ఫెడరేషన్‌, అమెరికా వంటి కొన్ని దేశాలు 2023 ప్రారంభంలో కనిపించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డాయి. అందుకే ప్రపంచ వృద్ధి 2.7 శాతానికి చేరగలిగింది. మరో వైపు, చైనా 2024లో 4.9% వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా. అంతర్జాతీయ అనిశ్చితులు, గృహ సంక్షోభం, ఉద్యోగ మార్కెట్‌, వినియోగంలో స్తబ్దత ఇందుకు కారణం కావొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని