దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు

మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రేడియంట్స్‌/ కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది.

Published : 18 Apr 2024 02:20 IST

దేశీయ ఫార్మా కంపెనీలకు మేలు
లాభాలు పెరిగే అవకాశం
ఈనాడు - హైదరాబాద్‌

మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రేడియంట్స్‌/ కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. వీటిని చాలావరకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో పెన్సిలిన్‌ జీ, అజిత్రోమైసిన్‌, సెఫ్‌ట్రియాగ్జోన్‌, విటమిన్‌ బి1, అమోక్సిసిలిన్‌.. తదితర ఔషధాలున్నాయి. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో వీటి ధరలు, 2023 ఇదే కాలంతో పోల్చిచూస్తే దాదాపు 14% తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

కలిసొచ్చిన పీఎల్‌ఐ పథకం

చైనాలో ముడి ఔషధాల ఉత్పత్తిలో పెద్దగా పెరుగుదల లేదు. మనదేశంలో మాత్రం వీటి ఉత్పత్తి క్రమేపీ పెరుగుతోంది. కొవిడ్‌-19 పరిణామాల తర్వాత కేంద్రం ప్రభుత్వం ‘ముడి ఔషధాల దేశీయ ఉత్పత్తి పెంచి, చైనాపై ఆధారపడటం తగ్గించాలని’ నిర్ణయించి, ఆ దిశగా చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణం.  ముడి ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద రాయితీలు, ప్రోత్సాహకాలు వర్తింపజేస్తుండటం ఉపకరిస్తోంది.  పీఎల్‌ఐ పథకం కింద పెన్సిలిన్‌ జీ ఔషధాల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ యూనిట్‌ను అరబిందో ఫార్మా నెలకొల్పింది. దేశంలోని మరికొన్ని చోట్ల ముడి ఔషధాల ఉత్పత్తి కోసం యూనిట్లు ఏర్పాటవుతున్నందున, దేశీయంగా వీటి ఉత్పత్తి, సరఫరా పెరుగుతోంది. తత్ఫలితంగానే ముడి ఔషధాల ధరలు మనదగ్గర కొంత తగ్గినట్లు తెలుస్తోంది. దేశీయ ఫార్మా కంపెనీలకు ఇది కలిసొచ్చే పరిణామమే. అయితే రవాణా ఛార్జీలు పెరగడం, మార్కెటింగ్‌- బ్రాండింగ్‌- విక్రయాల ఖర్చులూ అధికమై ఫార్మా కంపెనీలు కొంత ఇబ్బంది పడుతున్నాయి.

ఆదాయాలు 15% పెరిగే వీలు

దేశీయ మార్కెట్లో తుది ఔషధాలు (ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌, ఇంజెక్షన్లు) విక్రయిస్తున్న అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల జనవరి- మార్చి ఆదాయాలు, ఏడాది క్రితం ఇదే కాలంతో పోల్చితే సగటున 15% వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సానుకూలత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్లో అధిక విలువ గల జనరిక్‌ ఔషధాలను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. కానీ పోటీ నేపథ్యంలో, ఈ ఔషధాలపై వచ్చే ఆదాయం కొంత తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని  రకాల క్యాన్సర్‌ వ్యాధుల చికిత్సలో వినియోగించే జనరిక్‌ రెవ్లీమిడ్‌ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, సిప్లా.. తదితర కంపెనీలు అమెరికాలో అందిస్తున్నాయి. కానీ పోటీ వల్ల ఈ మందుపై లాభాలు క్రమేపీ తగ్గుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని కొత్త జనరిక్‌ ఔషధాలను మన కంపెనీలు అమెరికాలో విడుదల చేసే అవకాశాలున్నాయి. అందువల్ల దేశీయ ఫార్మా కంపెనీలు సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతాయని, 2025, 2026 ఆర్థిక సంవత్సరాల్లో మెరుగైన ఆదాయాలు నమోదు చేయగలుగుతాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని