సంక్షిప్తవార్తలు (7)

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 19 Apr 2024 01:07 IST

15% పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభం
ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్న దీపక్‌ పరేఖ్‌

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.359 కోట్లతో పోలిస్తే ఇది 14.7% అధికం. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.21,426 కోట్ల నుంచి రూ.27,893 కోట్లకు పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.19,427 కోట్ల నుంచి రూ.20,488 కోట్లకు చేరింది.

  • రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది. 
  • కంపెనీ ఎంబెడెడ్‌ విలువ (భవిష్యత్‌ లాభాల ప్రస్తుత విలువ+సర్దుబాటు చేసిన నికర ఆస్తుల విలువ) రూ.39,527 కోట్ల నుంచి రూ.47,468 కోట్లకు చేరింది.
  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.1,360 కోట్ల నుంచి 15% పెరిగి రూ.1,569 కోట్లకు చేరింది. సాల్వెన్సీ మార్జిన్‌ 203% నుంచి 187 శాతానికి తగ్గింది.
  • బోర్డు ఛైర్మన్‌ పదవి నుంచి దీపక్‌ పరేఖ్‌ వైదొలిగారు. ఈనెల 18 (గురువారం) వ్యాపార పనివేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. కొత్త ఛైర్మన్‌గా కేకి ఎం మిస్త్రీ నియామకానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2000 డిసెంబరు నుంచి కంపెనీలో ఉన్న ఆయన, ప్రస్తుతం బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

2024-25లో 33 జాతీయ రహదారుల నగదీకరణ: ఎన్‌హెచ్‌ఏఐ

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 33 జాతీయ రహదారులను నగదీకరణ చేస్తామని భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గుర్తించింది. ఈ రహదారుల పొడవు సుమారు 2,741 కి.మీ. ఉంది. వీటిని టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (టీఓటీ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్విట్‌) పద్ధతుల్లో అప్పగిస్తారు. నగదీకరణ చేయాలని నిర్ణయించిన రహదారుల్లో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ- అలిగఢ్‌, కాన్పూర్‌- అయోధ్య- గోరఖ్‌పూర్‌, బరేలి- సీతాపూర్‌; రాజస్థాన్‌లోని గురుగ్రామ్‌- కోట్‌పుత్లి- జయపుర బైపాస్‌; జయపుర- కిషన్‌గఢ్‌; ఒడిశాలోని పానికోయిలి- రిములి; తమిళనాడులోని చెన్నై బైపాస్‌; బిహార్‌లోని ముజఫర్‌పుర్‌- దర్భంగ, పుర్నియా రోడ్లు ఉన్నాయి. 2023-24లో వివిధ పద్ధతుల్లో రహదారుల నగదీకరణ ద్వారా  రూ.28,868 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.40,314 కోట్లను ఎన్‌హెచ్‌ఏఐ సమీకరించింది.  


విదేశీ బెట్టింగ్‌ కంపెనీల వల్ల జీఎస్‌టీ రూపేణ రూ.20,000 కోట్ల నష్టం

దిల్లీ: విదేశాల్లో ఉంటూ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే (ఆఫ్‌షోర్‌) చట్టవ్యతిరేక బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ సంస్థల వల్ల జీఎస్‌టీ ఆదాయం రూపేణ ఏటా 2.5 బిలియన్‌ డాలర్ల (రూ.20,000 కోట్లకు పైగా) నష్టం వాటిల్లుతోందని అఖిల భారత గేమింగ్‌ సమాఖ్య (ఏఐజీఎఫ్‌) అంచనా వేస్తోంది. అటువంటి ప్లాట్‌ఫారాలపై కేంద్రప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. ఆఫ్‌షోర్‌ కంపెనీలు వివిధ గేమ్స్‌ను చట్టవ్యతిరేక బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌తో కలిపి ఇస్తున్నాయి. దీంతో చట్టబద్ధ గేమ్స్‌కు, చట్టవ్యతిరేక గేమ్స్‌కు మధ్య అంతరాన్ని వినియోగదార్లు పసిగట్టలేకపోతున్నారని ఏఐజీఎఫ్‌ సీఈఓ రోలండ్‌ లాండర్స్‌ పేర్కొన్నారు. ఇది భారత్‌లోని చట్టబద్ధ పరిశ్రమకు హాని కలిగించడంతో పాటు వినియోగదార్లనూ ముంచుతోందని ఆయన అన్నారు. ఈ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఏటా 12 బి. డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) వరకు డిపాజిట్లను వసూలు చేస్తున్నాయి. అంటే జీఎస్‌టీ రూపంలో 2.5 బిలియన్‌ డాలర్ల మేర కేంద్రానికి నష్టం వాటిల్లుతోందని వివరించారు. ‘కొన్ని సంస్థలు ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వ్యాపార ప్రకటనలు పెంచాయి. తమ ప్లాట్‌ఫారాలపై జీఎస్‌టీ/టీడీఎస్‌ వర్తించదనీ బాహాటంగానే పేర్కొంటున్నాయ’న్నారు.


ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లాభం రెట్టింపు

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నికర లాభం రూ.537 కోట్లకు చేరింది. 2022-23 ఇదే కాల లాభం రూ.263 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.  కంపెనీ మొత్తం ఆదాయం రూ.885 కోట్ల నుంచి 74% పెరిగి రూ.1,544 కోట్లకు చేరింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.17 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ రూ.29కి చేరింది. మే 7 నుంచి అమల్లోకి వచ్చేలా ఎండీ, సీఈఓగా విజయ్‌ ఛండోక్‌ పునర్నియామకానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


నిస్సాన్‌ మాగ్నైట్‌లు వెనక్కి

దిల్లీ: నిస్సాన్‌ మోటార్‌ ఇండియా తన మాగ్నైట్‌ కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తోంది. 2020 నవంబరు నుంచి 2023 డిసెంబరు మధ్య ఉత్పత్తి చేసిన ఈ మోడల్‌ కార్లలో, ముందు డోరు హ్యాండిల్‌ సెన్సార్లలో లోపాన్ని సరిచేసేందుకే పిలిపిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఎన్ని కార్లలో ఈ లోపం ఉండొచ్చనేది సంస్థ వెల్లడించలేదు. ఎక్స్‌ఈ (బేస్‌), ఎక్స్‌ఎల్‌ (మిడ్‌) వేరియంట్లలో లోపాన్ని గమనించామని, వినియోగదార్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయా కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వినియోగదార్లు తమ దగ్గర్లోని నిస్సాన్‌ సర్వీస్‌ వర్క్‌షాప్‌నకు వస్తే, లోపాన్ని ఉచితంగా సరి చేస్తామని వివరించింది.


డయాజైపామ్‌ ఇంజెక్షన్‌ ప్రీఫిల్డ్‌ సిరంజి విక్రయంపై వివాదం

ఈనాడు, హైదరాబాద్‌: డయాజైపామ్‌ ఇంజెక్షన్‌ ప్రీఫిల్డ్‌ సిరంజి విక్రయంపై ప్రెషెనియస్‌ కబీ యూఎస్‌ఏ సంస్థ అమెరికాలోని డెలావేర్‌ జిల్లా న్యాయస్థానంలో, నాట్కో ఫార్మాకు చెందిన నాట్కో ఫార్మా యూఎస్‌ఏ ఎల్‌ఎల్‌సీపై ఫిర్యాదు చేసింది. ఈవిషయాన్ని నాట్కో ఫార్మా వెల్లడించింది. ఆందోళన, కండరాల నొప్పులు, మరికొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్సలో డయాజైపామ్‌ను వినియోగిస్తున్నారు. ఈ వివాదాన్ని న్యాయస్థానంలో ఎదుర్కొంటామని నాట్కో ఫార్మా స్పష్టం చేసింది.


పవర్‌మెక్‌ ప్రాజెక్ట్‌కు రూ.232 కోట్ల ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌: పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.232 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పవర్‌ హౌస్‌, బ్యాలెన్స్‌ ఆఫ్‌ ప్లాంటు నిర్మాణం, కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌ పనులు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఈ ఆర్డర్లు దక్కించుకున్నట్లు పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని