+530 నుంచి -455 పాయింట్లకు

ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది.

Published : 19 Apr 2024 01:17 IST

4 రోజుల్లో ఆవిరైన రూ.9.30 లక్షల కోట్ల సంపద
సమీక్ష

ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల కోతలపై ఆశలు తగ్గడానికి తోడు ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు పెరిగి 83.52 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.63% తగ్గి 86.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు రాణించాయి.

మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.9.30 లక్షల కోట్లు ఆవిరై రూ.392.89 లక్షల కోట్లకు చేరింది. గత 4 రోజుల్లో సెన్సెక్స్‌ 2,549.16 పాయింట్లు కుదేలైంది.

సెన్సెక్స్‌ ఉదయం 73,183.10 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ, 530 పాయింట్ల లాభంతో 73,473.05 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్‌, ఒకదశలో 72,365.67 పాయింట్లకు పడిపోయింది. చివరకు 454.69 పాయింట్లు నష్టపోయి 72,488.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 152.05 పాయింట్లు తగ్గి 21,995.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,961.70- 22,326.50 పాయింట్ల మధ్య కదలాడింది.

  • భారత్‌ సహా పలు దేశాల్లో శిశు ఉత్పత్తుల్లో అధిక చక్కెర వినియోగిస్తున్నట్లు వార్తలు రావడంతో నెస్లే ఇండియా షేరు 3.31% కుదేలై రూ.2,462.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8,137.49 కోట్లు తగ్గి రూ.2.37 లక్షల కోట్లకు చేరింది.
  • త్రైమాసిక లాభం 38% పెరగడంతో జస్ట్‌ డయల్‌ షేరు 12.97% దూసుకెళ్లి రూ.1,009.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1,024.85 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.
  • కంపెనీలో గౌతమ్‌ అదానీ కుటుంబం     రూ.8,339 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో అంబుజా సిమెంట్స్‌ షేరు ప్రారంభ ట్రేడింగ్‌లో 3.88% లాభపడి రూ.640.95 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు లాభాల స్వీకరణతో 0.11% తగ్గి రూ.616.30 వద్ద ముగిసింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 నష్టపోయాయి. టైటన్‌ 3.31%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.72%, ఎన్‌టీపీసీ 2.19%, టాటా మోటార్స్‌ 2.12%, ఐటీసీ 1.64%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.50%, టెక్‌ మహీంద్రా 1.35%, సన్‌ఫార్మా 1.29%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.13%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.13% నీరసపడ్డాయి. ఎయిర్‌టెల్‌ 4.15%, పవర్‌గ్రిడ్‌ 2.13%, ఇన్ఫోసిస్‌ 0.41% లాభపడ్డాయి.
  •  క్లౌడ్‌ సేవలు అందించే బ్లేజ్‌క్లాన్‌ టెక్నాలజీస్‌ను అనుబంధ సంస్థ ఐటీసీ ఇన్ఫోటెక్‌ ఇండియా రూ.485 కోట్ల వరకు చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు ఐటీసీ వెల్లడించింది. ఈ లావాదేవీ పూర్తయ్యేందుకు 6-8 వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
  • తమ శ్రీలంక కార్యకలాపాలను డైలాగ్‌ యాక్సియటాతో ఈక్విటీ స్వాప్‌ లావాదేవీ పద్ధతిలో విలీనం చేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ శ్రీలంక టర్నోవర్‌ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.294 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ మొత్తం వ్యాపారంలో ఇది 0.21 శాతానికి సమానం.
  • హీటింగ్‌ పరికరాల తయారీ సంస్థ జేఎన్‌కే ఇండియా ఐపీఓ ఈనెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.395- 415 ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.650 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు 22న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 36 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
  • ప్రపంచంలో మూడో అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా అవతరించినట్లు హిందుస్థాన్‌ జింక్‌ తెలిపింది
  • హరియాణాలోని మనేసర్‌ తయారీ ప్లాంట్‌లో కొత్త ఇంజిన్‌ అసెంబ్లీ లైన్‌ను హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రారంభించింది. రోజుకు ఇక్కడ 600 ఇంజిన్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.
  • వొడాఫోన్‌ ఐడియా రూ.18,000 కోట్ల ఫాలోఆన్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు మొదటి రోజైన గురువారం 26% స్పందనే లభించింది. 1260 కోట్ల షేర్లను సంస్థ ఆఫర్‌ చేయగా, 331.24 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.
  • కంపెనీ ఖాతాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో దిల్లీకి చెందిన లీల్‌ ఎలక్ట్రికల్స్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.14.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ ప్రమోటర్‌ భరత్‌రాజ్‌ పంజ్‌, ఆరుగురు మాజీ అధికారులను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి అయిదేళ్ల పాటు నిషేధించింది. నమోదిత సంస్థల్లో వారు మూడేళ్ల పాటు పనిచేయరాదని ఆదేశించింది.
  •  భవిష్యత్‌ కార్యాచరణను కంపెనీ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించడంతో వేదాంతా షేరు ఇంట్రాడేలో   4.41% పరుగులు తీసి రూ.394.70 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.88% లాభంతో రూ.388.90 వద్ద ముగిసింది. ఈ నెలలో కంపెనీ షేరు 45% దూసుకెళ్లడం విశేషం. గత 10 ఏళ్లలో షేరుకు ఇది అతిపెద్ద ఒకనెల లాభం.

నేటి బోర్డు సమావేశాలు: విప్రో, జియో ఫైనాన్షియల్‌, హిందుస్థాన్‌ జింక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని