హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 19 Apr 2024 06:56 IST

13% వాటా విలువ రూ.1000 కోట్లు
మరికొన్ని విమానాశ్రయాలు ప్రైవేటుకు
ఎన్నికల తర్వాత మొదలు కానున్న ప్రక్రియ  
ఈనాడు, హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా తన ఆధీనంలో ఉన్న విమానాశ్రయాల్లో కొన్నింటిని ప్రైవేటు పరం చేయడం, మరికొన్నింటిలో వాటా విక్రయించేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాక ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. విమానాశ్రయాల నుంచి ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణాను గణనీయంగా పెంచడంతో, దేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని అధిక వృద్ధి బాటలో ప్రవేశపెట్టటం లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయని చెబుతున్నారు.

జీఎంఆర్‌ గ్రూప్‌నకు 74% వాటా

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ గ్రూపు నిర్మించి, నిర్వహిస్తోంది. ఇందులో జీఎంఆర్‌ గ్రూపు వాటా 74% కాగా, మిగిలిన 26 శాతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 13%, ఏఏఐకు 13% వాటా ఉన్నాయి. తన 13% వాటా విక్రయించడానికి ఏఏఐ సన్నద్ధం అవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ ఏడాది చివరిలోగా ఏఏఐ వాటా విక్రయం పూర్తవుతుందని అంటున్నారు. ఈ 13 శాతాన్ని జీఎంఆర్‌ గ్రూపు కొనుగోలు చేస్తుందా, లేక ఏదైనా ఇతర సంస్థ సొంతం చేసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఈ వాటా విలువ రూ.1,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కొంతకాలంగా ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా విభాగాల్లో హైదరాబాద్‌ విమానాశ్రయం ఎంతో అధిక వృద్ధి సాధిస్తోంది. కొవిడ్‌-19 ముందు కంటే మించిన ట్రాఫిక్‌ ఈ విమానాశ్రయంలో నమోదవుతోంది. అందువల్ల హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఏఏఐ వాటా సొంతం చేసుకోవడానికి వివిధ సంస్థలు పోటీ పడొచ్చు.

బెంగళూరులోనూ..

బెంగళూరు విమానాశ్రయంలో ఏఏఐకి ఉన్న 13% వాటానూ విక్రయించే అవకాశం ఉంది. ఆ విమానాశ్రయం గతంలో జీవీకే గ్రూపు నిర్వహణలో ఉండేది.  జీవీకే చేతిలో ఉన్న 64% వాటాను ఫెయిర్‌ఫాక్స్‌ ఇండియా హోల్డింగ్స్‌ కొనుగోలు చేసింది. ఆ విమానాశ్రయంలో సీమెన్స్‌ ప్రాజెక్ట్‌ వెంచర్స్‌కు 10%, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, ఏఏఐ లకు చెరి 13% వాటాలున్నాయి.

ప్రైవేటీకరణ జాబితాలో తిరుపతి?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న 10-13 విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇండోర్‌, రాయ్‌పూర్‌, వారణాసి, హుబ్లీ, జబల్‌పూర్‌, తిరుపతి, కాంగ్రా తదితర విమానాశ్రయాలూ ప్రైవేటు పరం కావచ్చని అంటున్నారు.

2025కు రూ.20,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా

విమానాశ్రయాల ప్రైవేటీకరణ, విమానాశ్రయాల నిర్వహణ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి నేషనల్‌ మోనిటైజేషన్‌ ప్లాన్‌ (ఎన్‌ఎంపీ)ను మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ ద్వారా 2025 కల్లా రూ.20,000 కోట్లకు పైగా నిధులు సమీకరించాలన్నది యోచన. ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న విమానాశ్రయాలతో పోలిస్తే, ప్రైవేటు సంస్థల ఆధీనంలోని విమానాశ్రయాలు అధిక వృద్ధిని నమోదు చేస్తున్నాయనే పేరిట, ప్రైవేటీకరణ చేస్తున్నారు.

దేశంలో అత్యంత రద్దీ నమోదయ్యే, అత్యంత లాభదాయకమైన దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి విమానాశ్రయాలు ప్రైవేటు సంస్థల చేతిలో ఉన్నాయి. చెన్నై, కోల్‌కతాతో పాటు తక్కువ రద్దీ ఉండే ద్వితీయ శ్రేణి నగరాల్లోని విమానాశ్రయాలే ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి. కాబట్టి సహజంగానే ప్రైవేటు అజమాయిషీలోని విమానాశ్రయాల్లో అధిక వృద్ధి కనిపిస్తోంది. వీటిల్లో ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ (వినియోగదారు అభివృద్ధి రుసుం) కూడా ఎక్కువగానే ఉండటం గమనార్హం. ప్రైవేటు సంస్థలకు విమానాశ్రయాలు అప్పగిస్తే, ఆధునికీకరణకు తోడు సమర్థ నిర్వహణ ఉంటుందని, తద్వారా విమానాలు, ప్రయాణికుల రాకపోకలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణ. అందుకే ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని