అంచనాలను మించిన ఇన్ఫోసిస్‌

ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది.

Updated : 19 Apr 2024 17:12 IST

లాభం 30% వృద్ధితో రూ.7,969 కోట్లకు
2023-24కు రూ.20 తుది డివిడెండు; రూ.8 ప్రత్యేక డివిడెండు
వరుసగా అయిదో త్రైమాసికంలోనూ తగ్గిన ఉద్యోగుల సంఖ్య
2024-25కు 1-3% ఆదాయ వృద్ధి అంచనా 

‘గత ఆర్థిక సంవత్సరంలో పెద్ద కాంట్రాక్టుల విలువ రికార్డు స్థాయికి చేరడం.. క్లయింట్లకు మాపై ఉన్న బలమైన విశ్వాసాన్ని తెలియజేస్తోంది. జెనరేటివ్‌ ఏఐ విభాగంలో మా సామర్థ్యాలను విస్తరించుకోవడాన్ని కొనసాగిస్తాం.’ 

   ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌

దిల్లీ: ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,128 కోట్లతో పోలిస్తే, ఇది 30% అధికం. ఏకీకృత ఆదాయం కూడా రూ.37,923 కోట్ల నుంచి 1.3% పెరిగి రూ.37,441 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్‌ 20.1 శాతంగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 (400%) తుది డివిడెండును, ఒక్కో షేరుపై రూ.8 ప్రత్యేక డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

2023-24 మొత్తానికి

2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్‌ రూ.26,233 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 లాభం రూ.24,095 కోట్లతో పోలిస్తే ఈసారి 8.9% పెరిగింది. ఇదే సమయంలో ఆదాయం రూ.1,46,767 కోట్ల నుంచి 4.7% పెరిగి రూ.1,53,670 కోట్లకు చేరింది. నిర్వహణ మార్జిన్‌ 20.7 శాతంగా ఉంది.

2023-24లో పెద్ద కాంట్రాక్టుల మొత్తం విలువ 17.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.47 లక్షల కోట్ల)కు చేరింది. కంపెనీ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఇందులో 52% నికరంగా కొత్త కాంట్రాక్టులేనని కంపెనీ తెలిపింది.

23 ఏళ్లలో తొలిసారిగా ఉద్యోగుల సంఖ్య తగ్గింది

2023-24 చివరికి కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,17,240గా ఉంది. 2022-23 చివరికి ఉన్న 3,43,234 మందితో పోలిస్తే ఈసారి 25,994 (7.5%) మంది తగ్గారు. ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఉద్యోగుల సంఖ్య తగ్గడం గత 23 ఏళ్లలో ఇప్పుడే. జనవరి- మార్చి త్రైమాసికంలోనూ 5,423 మంది ఉద్యోగులు తగ్గారు. తద్వారా వరుసగా అయిదో త్రైమాసికంలోనూ ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లయ్యింది. జనవరి- మార్చిలో వలసల రేటు 12.6 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇది 12.9 శాతంగా ఉంది.

సామర్థ్య వినియోగం 82-83%

‘గత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఉద్యోగ సామర్థ్య వినియోగం ట్రెయినీలతో కలిపి 77 శాతంగా ఉంది. అప్పటి వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా, సిబ్బంది సామర్థ్యాన్ని వినియోగించుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు మారడంతో.. దానికి అనుగుణంగా మా విధానంలో మార్పులు చేసుకున్నాయి. ఉద్యోగ సామర్థ్య వినియోగం 82-83 శాతానికి పెరిగింది. మా వలసల రేటు గణనీయంగా తగ్గింది. నికరంగా మా ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు కనిపించడానికి ఇదే కారణమ’ని ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ జయేశ్‌  తెలిపారు.

85% ప్రతిఫలం లక్ష్యం

వాటాదార్లకు అధిక ప్రతిఫలాన్ని అందించేందుకే వ్యూహాత్మక, నిర్వహణ నిధుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే అయిదేళ్లకు (2024-25 నుంచి 2028-29 వరకు) మూలధన కేటాయింపు విధానాన్ని బోర్డు ఆమోదించినట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ విధానంలో వాటాదార్లకు 85% ప్రతిఫలాన్ని పంచాలని కంపెనీ భావిస్తోంది. వార్షిక డివిడెండును కూడా పెంచుకుంటూ వెళ్లాలని అనుకుంటోంది. కంపెనీ చేతిలో 848 మిలియన్‌ డాలర్ల (రూ.7000 కోట్లకు పైగా) నగదు నిల్వలు ఉన్నాయి. గత 11 త్రైమాసికాల్లోనే ఇవి అత్యధికం. 

రూ.4,000 కోట్లతో ఇన్‌-టెక్‌ కొనుగోలు

జర్మనీ సంస్థ ఇన్‌-టెక్‌లో 100% వాటాను పూర్తిగా నగదు రూపేణా రూ.4,000 కోట్ల (450 మిలియన్‌ యూరోల)కు కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. విద్యుత్తు వాహనాలకు సంబంధించి సొల్యూషన్లను ఇన్‌-టెక్‌ అభివృద్ధి చేస్తోంది. ఈ లావాదేవీ 2024-25 రెండో అర్ధభాగం కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కొనుగోలు వల్ల జర్మనీ వాహన తయారీదార్లతో సంబంధాలు పెరగడంతో పాటు... జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా, యూకే, చెక్‌ రిపబ్లిక్‌, రొమేనియా, స్పెయిన్‌, భారత్‌ దేశాల్లోని వివిధ విభాగాల్లో నైపుణ్యమున్న 2,200 మంది సిబ్బంది బృందం ఇన్ఫోసిస్‌తో కలుస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ రూపేణా ఆదాయంలో 1-3 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన 4-7 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే. నిర్వహణ మార్జిన్‌ 20-22 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ప్రాంగణ ఎంపికల సంఖ్యను నిర్ణయించలేదు

ఇకపై ఫ్రెషర్ల (తాజా ఉత్తీర్ణుల)ను పూర్తిగా కళాశాల ప్రాంగణ ఎంపికల ద్వారానే నియమించుకోబోమని సీఎఫ్‌ఓ వెల్లడించారు. సగం కంటే తక్కువ మందిని ప్రాంగణ ఎంపికల ద్వారా, మిగతా వారిని ఇతర మార్గాల్లో నియమించుకుంటామని పేర్కొన్నారు. అందువల్లే ఇప్పటివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రాంగణ నియామకాల లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకోలేదని తెలిపారు. గత నాలుగు త్రైమాసికాలుగా ఇన్ఫోసిస్‌, ప్రాంగణ ఎంపికలకు దూరంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని