హిందుస్థాన్‌ జింక్‌ ఆదాయాలు తగ్గాయ్‌

జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది.

Published : 20 Apr 2024 03:46 IST

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జెడ్‌ఎల్‌) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం కూడా రూ.8,863 కోట్ల నుంచి రూ.7,822 కోట్లకు తగ్గింది. వెండి అమ్మకాలు 5% పెరగడం, వ్యయం నియంత్రణ 11% మెరుగవ్వడం లాంటి సానుకూలతలు ఉన్నప్పటికీ, జింక్‌ ధరలు తగ్గడం వల్లే ఆదాయాలు, లాభంలో క్షీణతకు కారణమైందని కంపెనీ తెలిపింది. ‘2023-24 సంవత్సరం హెచ్‌జెడ్‌ఎల్‌కు బలమైన వృద్ధిని అందించింది. ముడి లోహం, శుద్ధి చేసిన లోహం, వెండి విభాగాల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి నమోదైంది. మా వ్యూహంలో భాగంగా వెండి, లోహ ఉత్పత్తి, వ్యయ నియంత్రణపై మరింతగా దృష్టి సారించడాన్ని కొనసాగిస్తామ’ని కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరుణ్‌ మిశ్రా తెలిపారు. మార్కెట్‌పరంగా సవాళ్లు ఎదురైనప్పటికీ.. మార్జిన్లను, వాటాదార్ల విలువను కాపాడుకోగలిగామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు హెచ్‌జెడ్‌ఎల్‌ రూ.13,197 కోట్లు అందించింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ రూ.2,099 కోట్ల నగదు నిల్వలను సమకూర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని