నెస్లే సెరిలాక్‌ ఉత్పత్తులపై దర్యాప్తు

భారత్‌లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్‌ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.

Published : 20 Apr 2024 03:48 IST

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏకు కేంద్రం ఆదేశాలు

దిల్లీ: భారత్‌లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్‌ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. భారతదేశంలో నెస్లే విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో చక్కెర అధికంగా వినియోగించిందన్న స్విస్‌ స్వచ్ఛంద సంస్థ పబ్లిక్‌ ఐ అండ్‌ ఇంటర్నేషనల్‌ బేబీ ఫుడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ (ఐబీఎఫ్‌ఏఎన్‌) నివేదిక వెలువడిన  నేపథ్యంలో ఈ ఆదేశాలొచ్చాయి. భారత్‌ సహా దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని వర్థమాన దేశాల్లో అధిక చక్కెర ఉన్న ఉత్పత్తులను నెస్లే విక్రయిస్తోందని ఆ నివేదిక ఆరోపించింది. ఈ  నివేదికలోని అంశాలపై నిగ్గుతేల్చాలంటూ, నెస్లేపై దర్యాప్తు చేపట్టాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి లేఖ రాసినట్లు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి, సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ(సీసీపీఏ) అధిపతి నిధి ఖరే తెలిపారు.

దేశ పిల్లల ఆరోగ్యం, భద్రతపై ఆందోళనతోనే: జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాల్లో విక్రయిస్తున్న సెరిలాక్‌లో మాత్రం చక్కెర వినియోగించకుండా.. భారత్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో మాత్రం ఒక సర్వింగ్‌కు 2.7 గ్రాముల వరకు చక్కెరను నెస్లే కలుపుతోందని ఆ నివేదిక ఆరోపించింది. అధిక చక్కెర ఉండే ఉత్పత్తుల వల్ల పిల్లల ఆరోగ్యం, భద్రతపై ప్రభావం పడుతుందన్న ఆందోళనల మధ్య ఈ లేఖ రాసినట్లు నిధి ఖరే తెలిపారు.

  • నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌(ఎన్‌సీపీసీఆర్‌) కూడా నివేదిక తమ దృష్టికి వచ్చినట్లు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి నోటీసు జారీ చేసినట్లు తెలిపింది.
  • గత అయిదేళ్లలో వేరియంట్‌ను బట్టి భారత్‌లోని శిశు ఆహార ఉత్పత్తుల్లో 30 శాతం వరకు యాడెడ్‌ షుగర్‌ను తగ్గించినట్లు గురువారం నెస్లే వివరణ ఇచ్చింది. థాయ్‌లాండ్‌లో విక్రయించే నెస్లే శిశు ఉత్పత్తుల్లో 6 గ్రాముల (ఒక్కో సర్వింగ్‌) చక్కెర ఉండగా.. ఫిలిప్పీన్స్‌లో ఎనిమిదింట అయిదు శాంపిళ్లలో ఇది 7.3 గ్రాములుగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని