నష్టాల నుంచి లాభాల్లోకి

సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్‌, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి.

Published : 20 Apr 2024 03:48 IST

సమీక్ష

సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్‌, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.55% లాభంతో 87.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 71,999.65 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో 71,816.46 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, అనంతరం బలంగా పుంజుకుంది. ఒకదశలో 73,210.17 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసి, చివరకు 599.34 పాయింట్ల లాభంతో 73,088.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 151.15 పాయింట్లు పెరిగి 22,147 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,777.65- 22,179.55 పాయింట్ల మధ్య కదలాడింది. వారం ప్రాతిపదికన చూస్తే.. సెన్సెక్స్‌ 1,156.57 పాయింట్లు, నిఫ్టీ 372.4 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

  • భారత్‌ సహా పలు దేశాల్లో విక్రయిస్తున్న శిశు ఉత్పత్తుల్లో అధిక చక్కెర శాతం ఉంటోందన్న వార్తలతో నెస్లే ఇండియా షేరు క్షీణత కొనసాగింది. శుక్రవారం మరో 1.04% నష్టపోయిన షేరు రూ.2,437.10 వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10,610.55 కోట్లు తగ్గి రూ.2.34 లక్షల కోట్లకు పరిమితమైంది.
  • భవిష్యత్తు ఆదాయ వృద్ధి అంచనాలు నిరాశపరచడంతో ఇన్ఫోసిస్‌ షేరు ఇంట్రాడేలో 2.47% తగ్గి రూ.1,378.75 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 0.63% నష్టంతో రూ.1,411.60 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3,655.37 కోట్లు తగ్గి, రూ.5.85 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 3.38%, ఎం అండ్‌ ఎం 2.90%, మారుతీ 2.54%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.49%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.46%, విప్రో 1.92%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.71%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.53%, ఐటీసీ 1.40%, టాటా స్టీల్‌ 1.31% రాణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.35%, నెస్లే 1.04%, టీసీఎస్‌ 0.93%, ఎల్‌ అండ్‌ టీ 0.89%, టాటా మోటార్స్‌ 0.84% వరకు నష్టపోయాయి.
  • నారాయణమూర్తి మనవడికి రూ.4.2 కోట్ల డివిడెండ్‌: ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి 5 నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి డివిడెండ్‌ రూపేణా రూ.4.20 కోట్లు దక్కనున్నాయి. ఇటీవల మనవడికి రూ.240 కోట్ల విలువైన 15 లక్షల షేర్లను నారాయణమూర్తి ఇచ్చారు. కంపెనీ గురువారం ఒక్కోషేరుపై రూ.28 డివిడెండ్‌ ఇవ్వడంతో, ఆ షేర్లపై ఏకాగ్రహ్‌కు ఈ మొత్తం లభించనుంది.
  • రానా కపూర్‌కు బెయిల్‌: రూ.466.51 కోట్ల మేరకు బ్యాంకులను మోసగించారనే ఆరోపణల కేసులో యెస్‌ బ్యాంక్‌ సహవ్యవస్థాపకుడు రానా కపూర్‌కు ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. 2020 మార్చిలో కపూర్‌ను మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసి, 8 కేసులను నమోదుచేసింది. ఈ కేసులన్నింటిలో ఆయనకు బెయిల్‌ లభించింది.
  • ఈపీఎఫ్‌ఓలోకి 1.65 కోట్ల మంది: గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో నికరంగా 1.65 కోట్ల మంది చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022-23లో చేరిన 1.38 కోట్ల మందితో పోలిస్తే ఈ సంఖ్య 19% అధికం. దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వడాన్ని ఇది సూచిస్తోంది. గత ఆరున్నరేళ్లలో 6.1 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓలో చేరారు. 2018-19లో 61.12 లక్షలు, 2019-20లో 78.58 లక్షలు, 2021-21లో 77.08 లక్షలు, 2021-22లో 1.22 కోట్లు మంది చొప్పున ఈపీఎఫ్‌ఓలో చేరారు.
  • కెనరా బ్యాంక్‌ రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు రికార్డు తేదీగా మే 15ను నిర్ణయించింది.
  • వాహన విడిభాగాల తయారీ సంస్థ ఎమ్‌ఫోర్స్‌ ఆటో టెక్‌ ఐపీఓ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.93-98 ను నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.54 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ తర్వాత కంపెనీ షేర్లు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి.
  • వొడాఫోన్‌ ఐడియా రూ.18,000 కోట్ల ఎఫ్‌పీఓ రెండో రోజు పుంజుకుంది. ఇష్యూలో 1260 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 617.46 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. యాంకర్‌ మదుపర్ల నుంచి వచ్చిన రూ.5400 కోట్లు కలిపితే, రెండో రోజు ముగిసేసరికి రూ.12,000 కోట్లకు పైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి.
  • భారత్‌, ఇతర విపణుల్లో ఇటలీ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ లోట్టో ఉత్పత్తులను విక్రయించేందుకు ఆసంస్థ యాజమాని డబ్ల్యూహెచ్‌పీ గ్లోబల్‌ నుంచి బ్రాండ్‌ లైసెన్స్‌ను కొనుగోలు చేసినట్లు స్పోర్ట్‌వేర్‌ ప్లాట్‌ఫామ్‌ అజిలిటాస్‌ స్పోర్ట్స్‌ వెల్లడించింది. 40 ఏళ్ల పాటు ఈ లైసెన్సు పనిచేస్తుంది.

నేటిబోర్డు సమావేశాలు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని