ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్‌

ఎన్నికల సంవత్సరంలోనూ భారత్‌ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది.

Published : 20 Apr 2024 03:49 IST

ఐఎమ్‌ఎఫ్‌ కితాబు

వాషింగ్టన్‌: ఎన్నికల సంవత్సరంలోనూ భారత్‌ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. ‘భారత్‌ 6.8% వృద్ధిరేటును నమోదు చేయనుండడం చాలా మెరుగైన అంశం. ద్రవ్యోల్బణమూ తగ్గుతోంది. స్థూల ఆర్థిక మూలాలూ బాగున్నాయ’ని ఐఎమ్‌ఎఫ్‌లోని ఆసియా, పసిఫిక్‌ విభాగం డైరెక్టర్‌ కృష్ణ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ‘సాధారణంగా ఎన్నికల ఏడాదిలో జనాకర్షక పథకాలను ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి. అయితే భారత్‌ మాత్రం ద్రవ్య క్రమశిక్షణను పాటించింది. వృద్ధి కొనసాగడానికి ఇది ఊతమిస్తుంద’ని అన్నారు. కొన్నేళ్లుగా పలు అనిశ్చితులను సమర్థంగా తట్టుకుని మరీ.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి కలిగిన పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింద’ని వివరించారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ 5తో ముగిసిన వారంలో మన విదేశీ మారకపు నిల్వలు 2.98 బి. డాలర్లు పెరిగి.. తాజా గరిష్ఠ స్థాయి అయిన 648.562 బిలియన్‌ డాలర్లకు చేరడాన్ని ప్రస్తావించారు.

‘అంతర్జాతీయ వృద్ధిలో భారత్‌ కనీసం 17% వాటాను అందిస్తోంది. డిజిటల్‌ పబ్లిక్‌ మౌలిక వసతుల వల్ల ఉత్పాదకత అధికమవుతోంది. తద్వారా ప్రభుత్వ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుండటం చాలా పెద్ద విషయం. భారత్‌లో యువ జనాభా అధికం. ఏటా 1.5 కోట్ల మంది కార్మిక శక్తికి జత అవుతూ ఉన్నారు. అందుకే ప్రపంచానికి భారత్‌ ఆశల దీపంగా కనిపిస్తోంద’ని శ్రీనివాసన్‌ వివరించారు.

‘అంతర్జాతీయ సవాళ్లలోనూ బలంగా భారత్‌’: అంతర్జాతీయ పరిస్థితులు సవాళ్లతో ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది కిందటితో పోలిస్తే బలమైన వృద్ధిని కనబరుస్తోందని ప్రపంచ బ్యాంకు కమిటీకి భారత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ వెల్లడించారు. వాషింగ్టన్‌లో డెవలప్‌మెంట్‌ కమిటీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘2023-24లో వరుసగా మూడు త్రైమాసికాల్లో 8 శాతానికి పైగా వృద్ధిని భారత్‌ సాధించింది. అంతర్జాతీయంగా స్తబ్దత ఉన్నప్పటికీ.. మెరుగ్గా రాణించగలిగింద’ని తెలిపారు. ఐఎమ్‌ఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక వసంతకాల సమావేశంలో మన దేశంనుంచి అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. భారత ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్‌ మార్కెట్లు రాణించిన తీరును అజయ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని