2026లో ఇండిగో ఎయిర్‌ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా

పూర్తి స్థాయి విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను భారత్‌లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.

Updated : 20 Apr 2024 08:44 IST

ట్యాక్సీ ఛార్జీలకు రెట్టింపులోపే

దిల్లీ: పూర్తి స్థాయి విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను భారత్‌లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ఇందుకోసం అమెరికా సంస్థ ఆర్చర్‌ ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌ట్యాక్సీతో దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ప్రకటించింది. ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్చర్‌ ఏవియేషన్‌ విద్యుత్తుతో నడిచే 200 ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (ఇవీటీఓఎల్‌) విమానాలను సరఫరా చేయనుంది. ఇందులో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణించొచ్చు. ఇవి హెలీకాప్టర్‌ల మాదిరిగా పనిచేస్తాయి. కానీ తక్కువ శబ్దం, అధిక భద్రతను కలిగి ఉంటాయి. 200 ఇవీటీఓఎల్‌ల ధర దాదాపు బిలియన్‌ డాలర్లు (రూ.8,300 కోట్లు). దిల్లీతో పాటు ముంబయి, బెంగళూరుల్లో కూడా ఎయిర్‌ట్యాక్సీ సేవలను ప్రారంభించడానికి ఇంటర్‌గ్లోబ్‌, ఆర్చర్‌ ఏవియేషన్‌ సంయుక్త సంస్థ చూస్తోంది.

  • కన్నాట్‌ ప్లేస్‌ నుంచి గురుగ్రామ్‌ మధ్య 7 నిమిషాల ప్రయాణానికి ఛార్జీ రూ.2000- 3000 వరకు ఉండొచ్చని ఆర్చర్‌ ఏవియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)తో చర్చలు నడుస్తున్నాయని, తమ విమానానికి సర్టిఫికేషన్‌ ప్రక్రియ తుది దశల్లో ఉందని ఆర్చర్‌ ఏవియేషన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్‌ గోల్డ్‌స్టీన్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో సర్టిఫికేషన్‌ రావొచ్చని, అనంతరం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వద్ద అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని వివరించారు. ప్రస్తుతం దిల్లీ-గురుగ్రామ్‌ మధ్య  27 కి.మీ. దూరానికి కారులో 90 నిమిషాల సమయం పడుతోందని, రూ.1500 వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు.
  • అయిదు సీట్లు కలిగిన ఇవీటీఓఎల్‌లో 6 బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. పూర్తి ఛార్జింగ్‌కు 30-40 నిమిషాల సమయం పడుతుంది. ఒక్క నిమిషం ఛార్జింగ్‌తో ఒక్క నిమిషం ప్రయాణించొచ్చని చీఫ్‌ కమర్షియల్‌ అధికారి నిఖిల్‌ గోయల్‌ వెల్లడించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని