విప్రో లాభం రూ.2,835 కోట్లు

‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు.

Updated : 20 Apr 2024 04:56 IST

జనవరి- మార్చిలో 7.8% క్షీణత
స్వల్పంగా తగ్గిన ఆదాయం
ఏప్రిల్‌- జూన్‌లో ఆదాయ వృద్ధి -1.5% నుంచి 0.5% ఉండొచ్చని అంచనా


‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే అవకాశాల విషయంలో ఆశావహ దృక్పథంతోనే ఉన్నాం. పోటీ సామర్థ్యం పెంచుకునేందుకు, వ్యాపార విలువ అధికమయ్యేందుకు ఉపకరిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికత, మా క్లయింట్ల అవసరాలను మార్చేస్తోంది. పెద్ద ఒప్పందాలను కుదుర్చుకోవడంపై దృష్టి సారించడంతో పాటు పెద్ద క్లయింట్లు, భాగస్వాములతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.’

శ్రీనివాస్‌ పల్లియా, సీఈఓ, విప్రో


దిల్లీ: ఐటీ సేవల కంపెనీ విప్రో నికర లాభం జనవరి- మార్చిలో 7.8% తగ్గి రూ.2,834.60 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,074.50 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.23,190.30 కోట్ల నుంచి 4.2% తగ్గి రూ.22,208.30 కోట్లుగా నమోదైంది. లాభం, ఆదాయాల పరంగా కంపెనీ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లుగానే నమోదయ్యాయి. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి (ఏప్రిల్‌- జూన్‌) త్రైమాసికంలో స్థిర కరెన్సీ రూపేణా ఐటీ సేవల విభాగ ఆదాయ వృద్ధి (-)1.5% నుంచి 0.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఇది పరిశ్రమ అంచనా కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2617- 2670 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21,721 - రూ.22161 కోట్ల) శ్రేణిలో ఐటీ సేవల విభాగ ఆదాయం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా (సీఈఓ) శ్రీనివాస్‌ పల్లియా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరికొన్ని వివరాలు ఇలా..

  • జనవరి- మార్చి త్రైమాసికంలో ఐటీ సేవల విభాగ ఆదాయం ఏడాదిక్రితంతో పోలిస్తే 6.4% తగ్గి 2657.4 మిలియన్‌ డాలర్లకు పరిమితం కాగా.. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 0.1% పెరిగింది.
  • ఐటీ సేవల నిర్వహణ మార్జిన్‌ 16.4 శాతంగా నమోదైంది. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 40 బేసిస్‌ పాయింట్లు పెరిగింది.
  • జనవరి- మార్చిలో మొత్తంగా 3.6 బిలియన్‌ డాలర్ల కాంట్రాక్టులను కంపెనీ దక్కించుకుంది. వీటిల్లో పెద్ద కాంట్రాక్టుల విలువ 1.2 బిలియన్‌ డాలర్లు. ఏడాదిక్రితం ఇదే సమయంలో దక్కించుకున్న పెద్ద కాంట్రాక్టుల విలువతో పోలిస్తే ఈ మొత్తం 9.5% ఎక్కువ.
  • పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 2.6% తగ్గి రూ.11,045.20 కోట్లకు పరిమితం కాగా.. ఆదాయం   0.8% తగ్గి రూ.89,760.30 కోట్లుగా నమోదైంది.
  • 24,516 మంది ఉద్యోగులు తగ్గారు:  2024 మార్చి చివరికి కంపెనీ సిబ్బంది సంఖ్య 2,34,054గా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 24,516 మంది, జనవరి- మార్చి త్రైమాసికంలో 6,180 మంది చొప్పున ఉద్యోగుల సంఖ్య తగ్గింది. విప్రో ఉద్యోగుల సంఖ్య తగ్గడం వరుసగా ఇది ఆరో త్రైమాసికం కాగా.. వరుసగా ఇది రెండో ఆర్థిక సంవత్సరం.
  • వలసల రేటు 14.2 శాతం వద్ద యథాతథంగా ఉంది.

3 కంపెనీల్లోనే 64,000 మంది: దేశంలో 3 దిగ్గజ ఐటీ కంపెనీల్లో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 64,000 మంది సిబ్బంది తగ్గారు. టీసీఎస్‌లో 13,249 మంది, ఇన్ఫోసిస్‌లో 25,994 మంది, విప్రోలో 24,516 మంది సిబ్బంది తగ్గినట్లు ఆయా సంస్థలే వెల్లడించాయి.


రిషద్‌, అజీమ్‌ పునర్నియామకం

విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా రిషద్‌ ఎ.ప్రేమ్‌జీని అయిదేళ్ల కాలానికి అంటే 2024 జులై 31 నుంచి 2029 జులై 30 వరకు కొనసాగేలా పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టరుగా అజీమ్‌ ప్రేమ్‌జీ పునర్నియామకానికి కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది. ఆయన 2024 జులై 31 నుంచి 2029 జులై 30 వరకు కూడా ఇదే ఈ పదవిలో కొనసాగుతారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని