సంక్షిప్త వార్తలు

నూతన రిటైల్‌ ఉత్పత్తులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించేందుకు గోద్రెజ్‌ జెర్సీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రూ.10కే లభించే పాల ప్యాకెట్లు, మిల్కీ షాట్స్‌లాంటి వాటిపై దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు.

Published : 21 Apr 2024 02:16 IST

కొత్త మార్కెట్లకు విస్తరణ: గోద్రెజ్‌ జెర్సీ

ఈనాడు, హైదరాబాద్‌: నూతన రిటైల్‌ ఉత్పత్తులతో కొత్త మార్కెట్లలోకి విస్తరించేందుకు గోద్రెజ్‌ జెర్సీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రూ.10కే లభించే పాల ప్యాకెట్లు, మిల్కీ షాట్స్‌లాంటి వాటిపై దృష్టి పెట్టినట్లు సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు. ఈ కొత్త తరహా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం కేశవరంలో ఉన్న ప్లాంటులో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల పరిమాణాల్లో ఉత్పత్తులను తీసుకొస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రోజుకు మొత్తం 7 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు వివరించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 2 లక్షల లీటర్ల వరకూ ఉంటున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 50,000కు పైగా రిటైల్‌ విక్రయ కేంద్రాలున్నాయని, వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంపాటు నిల్వ ఉండే ఉత్పత్తులను ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాలకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల మేరకు టర్నోవర్‌ సాధించామని తెలిపారు.


ఫిబ్రవరిలో ఈపీఎఫ్‌ఓలో 15.48 లక్షల మంది చేరిక

దిల్లీ: 2024 ఫిబ్రవరిలో మొత్తం 15.48 లక్షల మంది సభ్యులు సంస్థలో చేరారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) శనివారం వెల్లడించింది. వీరిలో తొలిసారిగా 7.78 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్‌ఓలో చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా చేరిన సభ్యుల్లో 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.36 శాతంగా ఉన్నారని పేర్కొంది. తొలిసారిగా చేరిన 7.78 లక్షల మంది సభ్యుల్లో 2.05 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మహిళా సభ్యులు ఫిబ్రవరిలో 3.08 లక్షల మంది జతయ్యారు. తయారీ, మార్కెటింగ్‌ సేవలు, కంప్యూటర్ల వినియోగం, రహదారి మోటార్‌ రవాణా, ఆటోమొబైల్‌ సర్వీసింగ్‌, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాల్లో అధికంగా సభ్యులు చేరారు. మొత్తం నికర సభ్యుల్లో సుమారు 41.53 శాతం మంది నైపుణ్య సేవల్లో (మ్యాన్‌పవర్‌ సరఫరా, సాధారణ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు, ఇతర కార్యకలాపాలు) చేరారు.


జొమాటోకు రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్‌ నోటీసు

దిల్లీ: ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు డెలివరీ చేసే ప్లాట్‌ఫామ్‌ జొమాటో రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్‌, పెనాల్టీ ఆర్డర్‌ అందుకుంది. భారత్‌ వెలుపల ఉన్న తన అనుబంధ సంస్థలకు 2017 జులై నుంచి 2021 మార్చి వరకు ఎగుమతి సేవలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి ఈ డిమాండ్‌ నోటీసు అందుకున్నట్లు తెలుస్తోంది. గురుగ్రామ్‌ సీజీఎస్‌టీ అదనపు కమిషనర్‌ ఈ ఆర్డర్‌ను పంపించారు. ఇందులో జీఎస్‌టీ డిమాండ్‌ రూ.5,90,94,889 (వడ్డీ అదనం), అపరాధ రుసుము  రూ.5,90,94,889గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని