ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ.1500 కోట్ల ఐపీఓ

సోలార్‌ సెల్‌, పీవీ మాడ్యూల్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు సిద్ధమైంది.

Published : 21 Apr 2024 02:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: సోలార్‌ సెల్‌, పీవీ మాడ్యూల్‌ తయారీ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు సిద్ధమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) వద్ద ఐపీఓ దరఖాస్తు(డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌) దాఖలు చేసింది. దీని ప్రకారం ఈ సంస్థ రూ.1,500 కోట్ల విలువకు కొత్తగా  ఈక్విటీ షేర్లు జారీ చేయటంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద ప్రమోటర్లు, కొందరు ఇన్వెస్టర్లు 2.82 కోట్ల షేర్లు విక్రయిస్తారు.

ప్రమోటరు చిరంజీవ్‌ సింగ్‌ సాలుజతో పాటు ఇన్వెస్టర్లు సౌత్‌ ఏషియా గ్రోత్‌ ఫండ్‌-2 హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ, సౌత్‌ ఏషియా ఈబీటీ ట్రస్ట్‌ ఇందులో ఉన్నాయి. ఐపీఓ కంటే ముందు ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ కింద రూ.300 కోట్లకు ఈక్విటీ షేర్లు కేటాయించే ఆలోచన కంపెనీకి ఉంది. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.1,168 కోట్లు తన అనుబంధ కంపెనీ అయిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పెట్టుబడి అవసరాలకు కేటాయిస్తారు. ఈ సబ్సిడరీ కంపెనీ 4 గిగావాట్ల సోలార్‌ పీవీ టాప్‌కాన్‌ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తారు.

 దాదాపు పాతికేళ్ల క్రితం ఏర్పాటైన ప్రీమియర్‌ ఎనర్జీస్‌కు ప్రస్తుతం 2 గిగావాట్ల సోలార్‌ సెల్‌, 3.36 గిగావాట్ల సోలార్‌ మాడ్యూల్‌ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఇదే కాకుండా ఈపీసీ సేవలు, ఓ అండ్‌ ఎం (ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) సేవలు ఈ సంస్థ అందిస్తోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల 5 యూనిట్లు ఈ సంస్థకు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.1,428 కోట్ల ఆదాయాన్ని, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి రూ.2,017 కోట్ల ఆదాయాన్ని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఆర్జించింది. కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.5,300 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ కంపెనీ, జేపీ మోర్గాన్‌ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ సంస్థ తొలి పబ్లిక్‌ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని