డిజిటల్‌ సేవలను విస్తరించే కంపెనీలకు భారతే తొలి ప్రాధాన్యం

డిజిటల్‌ సేవల విభాగాన్ని విస్తరించే యోచనలో ఉన్న కంపెనీలకు భారత్‌ ఉత్తమ ఎంపికగా మారిందని ఐటీ సేవల పరిశ్రమ సంఘం నాస్కామ్‌ తన నివేదికలో తెలిపింది.

Published : 21 Apr 2024 02:35 IST

ఏఐ, సైబర్‌ భద్రతపై మరిన్ని పెట్టుబడులు
నాస్కామ్‌ నివేదిక

దిల్లీ: డిజిటల్‌ సేవల విభాగాన్ని విస్తరించే యోచనలో ఉన్న కంపెనీలకు భారత్‌ ఉత్తమ ఎంపికగా మారిందని ఐటీ సేవల పరిశ్రమ సంఘం నాస్కామ్‌ తన నివేదికలో తెలిపింది. కృత్రిమ మేధ, డేటా అనాలటిక్స్‌, సైబర్‌ భద్రతపై కంపెనీలు పెట్టుబడులు పెంచే అవకాశం ఉందని తెలిపింది. 11 ప్రధాన రంగాలు, ఏడు ప్రధాన భౌగోళిక ప్రాంతాల్లోని 550 సంస్థలపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను నాస్కామ్‌ రూపొందించింది. ‘డిజిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మెచ్యూరిటీ 5.0: డిజిటల్‌ రెడీనెస్‌ ఇన్‌ ద ఎరా ఆఫ్‌ ఏఐ’గా వ్యవహరించే ఈ నివేదిక ప్రకారం..

  •  2023లో భారత్‌లోని 71 శాతం కంపెనీలు తమ సాంకేతిక వ్యయాల్లో 20 శాతం వరకు డిజిటల్‌ పైనే వెచ్చించాయి.
  •  2024లో కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా అనాలటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ భద్రత, ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్‌ లాంటి కీలక డిజిటల్‌ సాంకేతికత విభాగాల్లో పెట్టుబడులు పెట్టే ప్రణాళికలో ఉన్నట్లు సుమారు 90 శాతం కంపెనీలు సంకేతమిచ్చాయి.
  •  2023లో కీలక సాంకేతికతగా అవతరించిన జెనరేటివ్‌ ఏఐ(జెన్‌ ఏఐ)ను వినియోగించడం పెరుగుతుండటంతో 2025 అర్ధభాగం నాటికి సైబర్‌ భద్రతపై కంపెనీలు దృష్టి సారించడం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
  •  జెన్‌ ఏఐ వినియోగం పెరిగే కొద్ది డిజిటల్‌ నైపుణ్యాలపై కంపెనీలు వెచ్చించడం పెరగొచ్చు. తమ మొత్తం సిబ్బందిలో 6 శాతాన్ని ప్రత్యేకంగా డిజిటల్‌ విభాగానికి కేటాయించినట్లు 83 శాతం కంపెనీలు వెల్లడించడం గమనార్హం.
  •  బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా), హైటెక్‌, తయారీ, టెలికాం, మీడియా, వినోదం, ఇంధనం, యుటిలిటీస్‌ తదితర రంగాల్లోని కంపెనీలు తమ డిజిటల్‌ సేవలను విస్తరించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం కంపెనీలు భారత్‌ ఉత్తమ గమ్యస్థానంగా కొనసాగుతోంది.
  •  పర్యాటకం, రవాణా, టెలికాం, మీడియా, వినోదం, నిర్మాణం, ఇంజినీరింగ్‌ రంగాల్లోని 50 శాతం కంపెనీలు తమ పొరుగు సేవల అవసరాల నిమిత్తం భారత్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. టెలికాం, మీడియా, వినోదం, తయారీ, ఇంధనం, యుటిలిటీస్‌ రంగాల్లో భారత్‌ను ఉత్తమ ఎంపికగా భావిస్తున్న కంపెనీల సంఖ్య 47-49 శాతంగా ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని