హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం రూ.17,622 కోట్లు

జనవరి- మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం ఏకీకృత పద్ధతిలో          2 శాతం పెరిగి రూ.17,622 కోట్లకు చేరింది.

Updated : 21 Apr 2024 13:15 IST

డివిడెండు రూ.19.5

ముంబయి: జనవరి- మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం ఏకీకృత పద్ధతిలో 2 శాతం పెరిగి రూ.17,622 కోట్లకు చేరింది. స్టాండలోన్‌ పద్ధతిలోనూ నికర లాభం అంతకుముందు త్రైమాసికంలో (అక్టోబరు- డిసెంబరు)ని రూ.16,373 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 0.84 శాతం పెరిగి రూ.16,511.85 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 9.6 శాతం వృద్ధితో రూ.89,693.90 కోట్లకు పెరిగింది. అక్టోబర్‌-డిసెంబర్‌లో ఆదాయం  రూ.81,719.65 కోట్లుగా ఉంది. భవిష్యత్‌లో ఎలాంటి అవరోధాలనైనా ఎదుర్కొనేందుకు రూ.10,900 కోట్లను బ్యాంకు కేటాయించింది.

పెరిగిన వడ్డీ ఆదాయం..: కీలక నికర వడ్డీ ఆదాయం 24.5 శాతం పెరిగి రూ.29,080 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం కూడా రూ.18,170 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 0.04 శాతం మెరుగై   3.44 శాతంగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.26 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గగా.. నికర నిరర్థక ఆస్తులు 0.31 శాతం నుంచి 0.33 శాతానికి పెరిగాయి. మొత్తం కేటాయింపులు రూ.13,510 కోట్లుగా నమోదయ్యాయి. 2024 మార్చి చివరినాటికి మొత్తం డిపాజిట్‌లు 26.4 శాతం పెరిగి రూ.23.80లక్షల కోట్లకు చేరాయి. స్థూల రుణాలు 55.4 శాతం వృద్ధితో రూ.24.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 మార్చి 31 నాటికి బ్యాంకు కనీస మూలధన నిష్పత్తి 18.8 శాతంగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) నికర లాభం రూ.64,060 కోట్లుగా నమోదైంది.

650 కొత్త శాఖలు..: రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.19.5 డివిడెండును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డు సిఫారసు చేసింది. మార్చి త్రైమాసికంలో సుమారు 650 కొత్త శాఖలను బ్యాంకు తెరిచింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 8,738కు చేరింది. అయితే మొత్తంగా 12,000 శాఖలను కలిగి ఉండాలన్నది తమ లక్ష్యమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ముఖ్య ఆర్థిక అధికారి(సీఎఫ్‌ఓ) శ్రీనివాసన్‌ వైద్యనాథన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని