హర్మోజ్‌ జల సంధిని మూసేస్తే చమురు, ఎల్‌ఎన్‌జీ ధరలకు రెక్కలు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 22 Apr 2024 02:07 IST

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ వివాదం నేపథ్యం

దిల్లీ: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం వల్ల ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బ్యారెల్‌ ముడిచమురు ధర 90 డాలర్ల వద్ద కదలాడుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో భారత్‌ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ చమురును తీసుకొచ్చే నౌకలు ఒమన్‌-ఇరాన్‌ సముద్ర మార్గంలో ఉన్న హర్మోజ్‌ జల సంధిలో ప్రయాణిస్తుంటాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో, ఒకవేళ హర్మోజ్‌ జల మార్గాన్ని ఇరాన్‌ పూర్తిగా లేదంటే పాక్షికంగా మూసినా.. ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ (ద్రవరూప సహజ వాయువు) ధరలు అమాంతం పెరుగుతాయని అంచనా.
ఒమన్‌-ఇరాన్‌ మధ్య ఇరుకుగా ఉండే సముద్ర మార్గమే హర్మోజ్‌ జల సంధి. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే రోజుకు   2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21 శాతానికి సమానం. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్‌ఎన్‌జీలోనూ 20% ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది. ఈ నౌకలన్నీ హర్మోజ్‌ జలసంధి నుంచే రాకపోకలు సాగించాలి. భారత్‌ అవసరాల్లో 85% ముడి చమురు సౌదీ, ఇరాక్‌, యూఏఈ నుంచి రవాణా అవుతోంది. ఖతార్‌ నుంచి ఎల్‌ఎన్‌జీ కూడా ఈ మార్గంలోనే వస్తుంది. ఈ నేపథ్యంలో హర్మోజ్‌ జల సంధిని ఇరాన్‌ మూసేస్తే ఇబ్బందులు తప్పవు. దీంతో భారత్‌లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు