పశ్చిమాసియాపైనే కళ్లన్నీ

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో సంభవించే మార్పుల ఆధారంగా మార్కెట్లు ఈవారం కదలాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 22 Apr 2024 02:10 IST

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పరిణామాలే మార్కెట్లకు కీలకం
బ్యాంకింగ్‌, లోహ షేర్లు రాణించొచ్చు
వాహన, టెలికాం స్క్రిప్‌లలోనూ సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య రేగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో సంభవించే మార్పుల ఆధారంగా మార్కెట్లు ఈవారం కదలాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణిగేంత వరకు విదేశీ మదుపర్లు ‘బేరిష్‌’ ధోరణిలోనే ప్రవర్తించొచ్చంటున్నారు. గత వారం చివరి 4 సెషన్లలో దేశీయ మార్కెట్లో వారు నికర విక్రేతలుగా నిలిచి రూ.20,000 కోట్ల మేర పెట్టుబడులను వారు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో, ఎంపిక చేసిన స్క్రిప్‌లలో కదలికలు కనిపించొచ్చని తెలిపారు. నిఫ్టీ-50కి తక్షణ మద్దతు 22,100 వద్ద, నిరోధం 22,300-22,500 శ్రేణిలో కనిపించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. నిఫ్టీ తిరిగి 22,000 స్థాయిని అందుకోవడం బలమైన పునాదిగా ఉండగలదని చెబుతున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయంటే..

  • ఫలితాలకు ముందు ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ వారం గణాంకాలను వెలువరచే టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, నెస్లే షేర్లలో కదలికలు కనిపించొచ్చు. సెరిలాక్‌ వివాదం నేపథ్యంలో నెస్లే షేర్లు స్వల్పకాలంలో స్తబ్దుగా కదలాడొచ్చు.
  • బ్యాంకింగ్‌ షేర్లలో సానుకూలతలు ఉండొచ్చు. శనివారం ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరుపై ఆ ప్రభావం కనిపించొచ్చు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీకి 46,500 వద్ద మద్దతు, 48,000 వద్ద నిరోధం కనిపిస్తోంది.
  • ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం దేశీయ యంత్రపరికరాల కంపెనీలపై పరిమిత ప్రభావాన్నే చూపొచ్చు. పశ్చిమాసియా నుంచి భెల్‌, భారత్‌ డైనమిక్స్‌, ఎల్‌ అండ్‌ టీలకు ఎంచదగ్గరీతిలో ఆర్డర్లయితే ఉన్నాయి. ఫలితాలకు ముందు ఈ రంగ షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలొచ్చు.
  • ఐటీ కంపెనీల షేర్లు స్వల్పకాలానికి ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు. ఈ వారంలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ఫలితాలు వెల్లడించనున్నాయి.
  • ఇటీవల ర్యాలీ అనంతరం దిద్దుబాటుకు లోనైన ఔషధ సంస్థల షేర్లు ఊగిసలాడొచ్చు. యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు, అనుమతులు స్వల్పకాలంలో ఆయా షేర్లపై ప్రభావం చూపొచ్చు. బయోకాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లలో కొంత సానుకూలతలు కనిపించొచ్చు. ఆల్కెమ్‌, సిప్లా, పిరమాల్‌ ఫార్మా, సన్‌ ఫార్మాపై విశ్లేషకులు బేరిష్‌గా ఉన్నారు.
  • ప్రభావం చూపే వార్తలు లేనందున సిమెంటు షేర్లు ఊగిసలాడొచ్చు. మదుపర్లు సిమెంటు ధరలపై ఓ కన్నేయవచ్చు. అల్ట్రాటెక్‌ షేరును పరిశీలించొచ్చు. రామ్‌కో సిమెంట్స్‌, జేకే సిమెంట్‌లపైనా ఆసక్తి పెరుగుతోంది.
  • టెలికాం షేర్లు రాణించొచ్చు. ఫలితాలను గమనించాలి. రాబోయే వారాల్లో టారిఫ్‌ పెంపును అమలు చేసేవరకు ఈ రంగానికి సంబంధించి పెద్ద వార్తలేమీ ఉండకపోవచ్చు. వొడాఫోన్‌ ఐడియా రూ.18,000 కోట్ల సమీకరణ వల్ల కంపెనీ పరిస్థితేమీ మారకపోవచ్చని ఓ బ్రోకరేజీ అంచనా వేస్తోంది.
  • లోహ కంపెనీల షేర్లలో ‘బులిష్‌’ ధోరణి కనిపించనుంది. జిందాల్‌ స్టీల్‌, హిందుస్థాన్‌ కాపర్‌, టాటా స్టీల్‌ షేర్లు ‘బ్రేక్‌ అవుట్‌’కు సిద్ధంగా ఉన్నందున వాటిపై కన్నేయడం మంచింది.
  • వాహన కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. బలమైన ఫలితాలు, సాధారణ వర్షపాతం అంచనాలు ఇందుకు దోహదం చేయొచ్చు.  
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల కదలికల ఆధారంగా చమురు షేర్లకు దిశానిర్దేశం లభించొచ్చు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సోమవారం ప్రకటించే ఫలితాలను గమనించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని