అంచనాలు మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం ఆదివారం వెల్లడించింది.

Published : 22 Apr 2024 02:10 IST

2023-24లో 18% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరిక

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి రూ.19.58 లక్షల కోట్లకు చేరాయని పన్ను విభాగం ఆదివారం వెల్లడించింది. బడ్జెట్‌లో సవరించిన అంచనాలను మించి పన్ను వసూళ్లు నమోదయ్యాయని పేర్కొంది. ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నుల నికర వసూళ్లు బడ్జెట్‌ తొలి అంచనాల కంటే రూ.1.35 లక్షల కోట్లు (7.4%), సవరించిన అంచనాల కంటే రూ.13,000 కోట్లు (0.67%) అధికంగా నమోదైనట్లు తెలిపింది. ఫిబ్రవరి 1న సమర్పించిన తాత్కాలిక బడ్జెట్‌లో 2023-24 ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.19.45 లక్షల కోట్లకు సవరించింది. 2023-24లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలిక) 18.48% పెరిగి రూ.23.37 లక్షల కోట్లకు చేరాయి. నికర వసూళ్లు (రిఫండ్లు మినహాయించాక) 17.7% వృద్ధితో రూ.19.58 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని, వ్యక్తులు, కార్పొరేట్ల ఆదాయ స్థాయి పెరుగుదలను ఇది సూచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.79 లక్షల కోట్ల రిఫండ్‌ అందించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది.

  • 2022-23లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16.64 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.18.23 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం తొలుత నిర్దేశించుకుంది. తర్వాత రూ.19.45 లక్షల కోట్లకు సవరించింది. అంతకుమించి రూ.13,000 కోట్ల మేర అదనపు వసూళ్లు రావడం విశేషం.
  • స్థూల కార్పొరేట్‌ పన్ను వసూళ్లు (తాత్కాలిక) 13.06% పెరిగి రూ.11.32 లక్షల కోట్లకు చేరాయి. 2022-23లో ఇవి రూ.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు (తాత్కాలిక) రూ.8.26 లక్షల కోట్ల నుంచి 10.26% పెరిగి రూ.9.11 లక్షల కోట్లకు చేరాయి.
  • స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (సెక్యూరిటీల లావాదేవీ పన్నుతో కలిపి) రూ.9.67 లక్షల కోట్ల నుంచి 24.26% పెరిగి రూ.12.01 లక్షల కోట్లకు చేరాయి. నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.8.33 లక్షల కోట్ల నుంచి 25.23% పెరిగి రూ.10.44 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్‌లు రూ.3.09 లక్షల కోట్ల నుంచి 22.74% పెరిగి రూ.3.79 లక్షల కోట్లకు పెరిగాయి.
  • పరోక్ష పన్ను వసూళ్లు కూడా సవరించిన అంచనా రూ.14.84 లక్షల కోట్ల కంటే అధికంగానే నమోదయ్యాయని, రికార్డు స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఇందుకు దోహదపడ్డాయని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. పరోక్ష పన్ను వసూళ్లు (కస్టమ్స్‌, కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలతో కలిపి) గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే బాగా నమోదైనందుకు ఆనందంగా ఉందని సీబీఐసీ ఛైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ క్షేత్ర స్థాయి అధికారులకు ఇటీవలే లేఖ రాశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని