సంక్షిప్త వార్తలు(5)

అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్‌, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్‌ పికప్‌ జోన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Published : 23 Apr 2024 01:34 IST

అయోధ్య విమానాశ్రయంలో ఓలా సేవలు

దిల్లీ: అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్‌, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్‌ పికప్‌ జోన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విమానాశ్రయం వద్ద కార్యకలాపాలను నిర్వహించేందుకు రోజంతా అందుబాటులో ఉండేలా ప్రతినిధుల బృందాన్ని నియమించినట్లు వివరించింది. ‘అయోధ్య అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతం. ఆ నగరంలో సేవలను విస్తరించడం ఆనందంగా ఉంద’ని ఓలా మొబిలిటీ సీఈఓ హేమంత్‌ బక్షి వెల్లడించారు.


ఇఫ్కో నానో యూరియా ప్లస్‌ ఉత్పత్తి ఈ వారంలోనే ప్రారంభం

దిల్లీ: ‘నానో యూరియా ప్లస్‌’ ఎరువు ఉత్పత్తిని ఈ వారంలో ప్రారంభించనున్నట్లు ఇఫ్కో సోమవారం వెల్లడించింది. వాణిజ్య విక్రయాలు మే 1 నుంచి మొదలవుతాయని పేర్కొంది. కీలక దశల్లో పంటకు అవసరమయ్యే నత్రజనిని అందించేందుకు నానో యూరియాను వాడుతుంటారు. నానో యూరియా ప్లస్‌ అనేది నానో యూరియాలో కొత్త రకం. ప్రస్తుతం ఇఫ్కో నానో యూరియాలో 1-5 శాతం నత్రజని ఉంటుండగా.. నానో యూరియా ప్లస్‌ను 16 శాతం నత్రజనితో అందివ్వనుంది. గుజరాత్‌లోని కలోల్‌, ఉత్తరప్రదేశ్‌లోని ఓన్లా, పుల్పూర్‌ వద్ద ఉన్న ఇఫ్కోకు చెందిన మూడు ప్లాంట్లలో నానో యూరియా ప్లస్‌ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్లాంట్లకు రోజుకు 2 లక్షల బాటిళ్ల యూరియాను తయారు చేసే సామర్థ్యం ఉంది. నానో యూరియా ప్లస్‌ ఎరువును మూడేళ్ల పాటు ఇఫ్కో తయారు చేయనుంది.


ఆమ్నెస్టీ పథకం కొనసాగించాలి

చిన్న స్థాయి ఎగుమతిదార్ల అభ్యర్థన

దిల్లీ: ఎగుమతి నిబంధనల మేరకు డిఫాల్ట్‌ అయిన చాలా మంది చిన్న స్థాయి ఎగుమతిదార్లకు, ఏక కాల పరిష్కారం (వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌) కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని సెప్టెంబరు వరకు కొనసాగించాలని వారు అభ్యర్థించారు. 45 రోజుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎంఎస్‌ఎంఈల)కు చెల్లింపులు చేయాల్సి రావడంతో చాలామంది చిన్న స్థాయి ఎగుమతిదార్లు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయారని లూధియానాకు చెందిన హ్యాండ్‌ టూల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌సీ రల్హాన్‌ వెల్లడించారు. కస్టమ్స్‌ సుంకం, వడ్డీ కలిపి చెల్లించేందుకు ఉన్న గడువు 2024 మార్చి 31తో ముగిసినందున, సెప్టెంబరు వరకు కొనసాగించాలని కోరుతున్నారు.


1 నుంచి ఎస్కార్ట్స్‌ ట్రాక్టర్‌ ధరల పెంపు

దిల్లీ: తాము రూపొందిస్తున్న మొత్తం ట్రాక్టర్ల శ్రేణి ధరలను మే 1 నుంచి పెంచుతున్నట్లు ఎస్కార్ట్స్‌ కుబోటా సోమవారం ప్రకటించింది. పలు మోడళ్లు/వేరియంట్లు, ప్రాంతాల ఆధారంగా ధరల పెంపు ఉంటుందని తెలిపింది. ఏ స్థాయిలో ధరలను పెంచనుందో సంస్థ వెల్లడించలేదు.


ధ్రువ స్పేస్‌కు రూ.78 కోట్ల పెట్టుబడులు

ఈనాడు, హైదరాబాద్‌: అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ ధ్రువ స్పేస్‌ రూ.78 కోట్ల (9.4 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడులను సమీకరించింది. ఐఏఎన్‌ ఆల్ఫా ఫండ్‌, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డుతో పాటు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈక్విటీ, రుణాల రూపంలో ఈ మొత్తాన్ని స్వీకరించింది. దీంతో ఇప్పటి వరకు ఈ సంస్థ రూ.123 కోట్ల పెట్టుబడులను సాధించినట్లయ్యింది. పెట్టుబడుల్లో రూ.24 కోట్లను స్పేస్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వినియోగించనున్నట్లు, ఈ హైదరాబాదీ అంకురం వ్యవస్థాపకుడు, సీఈఓ సంజయ్‌ నెక్కంటి వెల్లడించారు. 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రెండేళ్లలో ధ్రువ స్పేస్‌ 4 అంతరిక్ష ప్రయోగాలను పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, అంతర్జాతీయంగా విస్తరించేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని సంజయ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని