అదానీ గ్రూప్‌ ‘ఆఫ్‌షోర్‌ ఫండ్‌’ల నిబంధనల అతిక్రమణ!

అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్‌షోర్‌ ఫండ్‌లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది.

Published : 23 Apr 2024 01:39 IST

పెట్టుబడుల పరిమితినీ దాటాయ్‌

ముంబయి: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్‌షోర్‌ ఫండ్‌లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘రాయిటర్స్‌’ తన కథనంలో పేర్కొంది. అదానీ సంస్థల్లో ఆఫ్‌షోర్‌ ఫండ్‌ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగినట్లు సెబీ గుర్తించిందని గతేడాది ఆగస్టులోనే రాయిటర్స్‌ తెలిపింది. ‘అదానీ గ్రూప్‌నకు, ఫండ్‌లలో ఒకదానికి ఏదైనా సంబంధం ఉందా అని అప్పట్లో సెబీ దర్యాప్తు చేపట్టింది. అదానీ ప్రాథమిక వాటాదార్లకు అది సహకరిస్తుందన్న ఆరోపణలనూ పరిశీలించిన’ట్లు వివరించింది. అదానీ గ్రూప్‌తో సంబంధమున్న 12 ఆఫ్‌షోర్‌ ఇన్వెస్టర్‌ సంస్థలకు ఈ ఏడాది మొదట్లో సెబీ నోటీసులు జారీ చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయనీ పేర్కొంది. వెల్లడి నిబంధనలు, పెట్టుబడుల పరిమితి ఉల్లంఘనలు, ఆరోపణల విషయంలో అదానీ గ్రూప్‌ వైఖరిపై వివరణను కోరుతూ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. వ్యక్తిగత ఫండ్‌ స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు ఆఫ్‌షోర్‌ ఫండ్‌లు తెలిపాయని.. అయితే ఆఫ్‌షోర్‌ ఫండ్‌ గ్రూప్‌ స్థాయిలో పెట్టుబడులు జరిగినట్లు వెల్లడించాలని సెబీ కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 12లో ఎనిమిది సంస్థలు తప్పును అంగీకరించకుండా, అపరాధ రుసుము కడతామని.. సమస్యను పరిష్కరించాలని రాతపూర్వక విజ్ఞప్తిని సమర్పించాయనీ తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని