ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన

మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అప్రమత్తమైంది.

Published : 23 Apr 2024 01:40 IST

సింగపూర్‌, హాంకాంగ్‌ ఆంక్షల నేపథ్యం: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ

దిల్లీ: మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సహా అన్ని బ్రాండ్లకు సంబంధించిన సుగంధ ద్రవ్యాల పొడి నమూనాలను పరిశీలించే ప్రయత్నాలు ప్రారంభించింది. నాణ్యత విషయంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు తగ్గట్లుగా ఇవి ఉన్నాయా లేదా అని పరిశీలించనున్నారు. ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాల నాణ్యతను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నియంత్రించడం లేదు. ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పనిచేస్తోంది. దేశీయ విపణుల్లో విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించేందుకు ఎప్పటికప్పుడు సుగంధ ద్రవ్యాల నమూనాను ఇది సేకరిస్తుంది. సుగంధ ద్రవ్యాల పొడిలో ఎథిలిన్‌ ఆక్సైడ్‌ నిర్దిష్ట పరిమితికి మించి ఉందని ఆరోపిస్తూ ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌కు సంబంధించి 4 ఉత్పత్తుల (ఎండీహెచ్‌ మద్రాస్‌ కర్రీ పౌడర్‌, ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎండీహెచ్‌ సాంబార్‌ మసాలా ఫిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌, ఎండీహెచ్‌ కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌)పై హాంకాంగ్‌, సింగపూర్‌ ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పైసెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టరు ఎ.బి.రెమా తెలిపారు. కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని