రెండో రోజూ లాభాల జోరు

ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు..

Updated : 23 Apr 2024 02:15 IST

రూ.4.97 లక్షల కోట్ల సంపద వృద్ధి
సమీక్ష

సియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. మన సూచీల రాణింపునకు దోహద పడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి  83.36 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.80% తగ్గి 86.59 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

  • మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.4.97 లక్షల కోట్లు పెరిగి రూ.397.86 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 1,159.63 పాయింట్లు లాభపడింది.
  • సెన్సెక్స్‌ ఉదయం 73,666.51 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 73,767.80 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 560.29 పాయింట్ల లాభంతో 73,648.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 189.40 పాయింట్లు పెరిగి 22,336.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,198.15-22,375.65 పాయింట్ల మధ్య కదలాడింది.

  • మార్చి త్రైమాసిక లాభం 6% పెరగడంతో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు ఇంట్రాడేలో 4% దూసుకెళ్లి రూ.385 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.45% లాభంతో రూ.382.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.8,100.44 కోట్లు పెరిగి రూ.2.43 లక్షల కోట్లకు చేరింది.
  • త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 1.24% నష్టపోయి రూ.1,512.30 దగ్గర స్థిరపడింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.14,434.12 కోట్లు తగ్గి రూ.11.48 లక్షల కోట్లుగా నమోదైంది.
  • త్రైమాసిక ఫలితాల ప్రభావంతో విప్రో షేరు 2.01% లాభపడి రూ.461.95 దగ్గర ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.4,756.93 కోట్లు పెరిగి రూ.2.41 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 రాణించాయి. ఎల్‌ అండ్‌ టీ 2.67%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.36%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.35%, అల్ట్రాటెక్‌ 2.13%, విప్రో 2.01%, ఎస్‌బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.94%, ఇన్ఫోసిస్‌ 1.48%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.24%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.19% లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ 2.24%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.17%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.46% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. మన్నికైన వినిమయ వస్తువులు 2.53%, పరిశ్రమలు 1.93%, యంత్ర పరికరాలు 1.65%, టెలికాం 1.17%, ఆర్థిక సేవలు 1.04%, వినియోగ 1.02% మెరిశాయి. యుటిలిటీస్‌ డీలాపడింది. బీఎస్‌ఈలో 2599 షేర్లు లాభాల్లో ముగియగా, 1310 స్క్రిప్‌లు నష్టపోయాయి. 148 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

వొడాఫోన్‌ ఐడియా ఎఫ్‌పీఓకు 7 రెట్ల స్పందన: వొడాఫోన్‌ ఐడియా రూ.18,000 కోట్ల ఫాలోఆన్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ముగిసే సరికి 6.99 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో 1260 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 8,011.29 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీల నుంచి 19.31 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి  4.54 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 56% చొప్పున స్పందన దక్కింది. ఎఫ్‌పీఓలో రూ.88,124 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చినప్పటికీ.. ఆఫర్‌ పరిమాణాన్ని రూ.12,600 కోట్లుగానే సంస్థ కొనసాగించింది. యాంకర్‌ మదుపర్ల నుంచి వచ్చిన రూ.5,400 కోట్లు కలిపితే, మొత్తం రూ.18,000 కోట్ల లక్ష్యాన్ని అందుకుంది.

నేటి బోర్డు సమావేశాలు: టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టాటా ఎలెక్సీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌, ఎంసీఎక్స్‌ ఇండియా, సైయెంట్‌ డీఎల్‌ఎం, నెల్కో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని