ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో

భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్‌మైట్రిప్‌ ఇండియా  రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్‌ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్‌లో వెతకడం పెరిగిందని పేర్కొంది.

Updated : 23 Apr 2024 07:06 IST

వారాంతపు విహారాలూ పెరిగాయ్‌
మేక్‌మైట్రిప్‌ ఇండియా నివేదిక

దిల్లీ: భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్‌మైట్రిప్‌ ఇండియా  రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్‌ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్‌లో వెతకడం పెరిగిందని పేర్కొంది. తనకున్న 10 కోట్ల మంది క్రియాశీలక వార్షిక వినియోగదార్ల అభిప్రాయాలు, పర్యాటక ధోరణుల ఆధారంగా సంస్థ ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం...

  • ఏడాదికి మూడు సార్లకు మించి పర్యాటక ప్రదేశాల్లో విహరిస్తున్న వారి సంఖ్య 25% పెరిగింది. పుణ్యక్షేత్రాలకు వెళ్లి రావాలన్న ఆసక్తి పెరగడం ఇందుకు ఓ కారణం.
  • 2021తో పోలిస్తే 2023లో ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం అన్వేషించిన వారి సంఖ్య 97% పెరిగింది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది.
  • 2022తో పోలిస్తే 2023లో అయోధ్య కోసం అన్వేషించిన వారి సంఖ్య 585% పెరగడం గమనార్హం.  ఉజ్జయిని, బద్రినాధ్‌ క్షేత్రాల వివరాల కోసం అన్వేషించిన వారి సంఖ్య కూడా వరుసగా 359%, 343% శాతం పెరిగింది.
  • వారాంతపు సెలవు దినాల్లో పర్యటించేందుకూ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. 2022తో పోలిస్తే 2023లో జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ కోసం అన్వేషించిన వారి సంఖ్య 131% పెరిగింది. ఊటీ, మున్నార్‌ లాంటి హిల్‌ స్టేషన్లు కూడా పర్యాటకులకు ప్రాధాన్య ఎంపికలుగా మారాయి.
  • అంతర్జాతీయ ప్రదేశాల కొస్తే.. ఎక్కువ మంది అన్వేషించిన వాటిల్లో తొలి మూడు స్థానాల్లో దుబాయ్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌ ఉన్నాయి. మన దేశం నుంచి ఎక్కువ దూరం ప్రయాణించే పర్యాటక ప్రదేశాల విషయంలో లండన్‌, టొరెంటో, న్యూయార్క్‌ ముందు వరసలో ఉన్నాయి.
  • హాంకాంగ్‌, అల్మటీ (కజకిస్తాన్‌), పారో (భూటాన్‌), బాకు (అజెర్‌బైజాన్‌), డా నాంగ్‌ (వియత్నాం), బ్లిసి (జార్జియా) లాంటి ప్రాంతాలపైనా ఇటీవల ఆసక్తి పెరుగుతోంది. 2023లో ఈ ప్రదేశాల కోసం అన్వేషించడంలో గణనీయ వృద్ధి కనిపించింది.
  • కుటుంబ సమేతంగా ప్రయాణాల కోసం బుకింగ్‌లు బాగా పెరిగాయి. 2022తో పోలిస్తే 2023లో ఈ బుకింగ్‌లు 64% పెరిగాయి. ఇదే సమయంలో ఒంటరిగా ప్రయాణించేందుకు బుకింగ్‌ల్లో వృద్ధి 23 శాతమే ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని