రిలయన్స్‌ టర్నోవర్‌ రూ.10 లక్షల కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్‌ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది.

Published : 23 Apr 2024 01:56 IST

ఈ మైలురాయి సాధించిన తొలి కంపెనీ ఇదే
2023-24 వార్షిక లాభం రూ.69,621 కోట్లు
జనవరి-మార్చిలో స్వల్పంగా తగ్గిన లాభం
దిల్లీ

‘‘అన్ని విభాగాలు బలంగా రాణించాయి. దీంతో పలు మైలురాళ్లను కంపెనీ సాధించగలిగింది. పన్నుకు ముందు లాభాల విషయంలో రూ.లక్ష కోట్లను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ నిలిచిందని చెప్పడానికి సంతోషిస్తున్నా. డిజిటల్‌ రిటైల్‌ విభాగాల్లో మంచి జోరు కనిపిస్తోంది. ’’

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్‌ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది.

త్రైమాసికం వారీగా..

2023-24 జనవరి-మార్చిలో రిలయన్స్‌ ఏకీకృత నికర లాభం రూ.18,951 కోట్లు (ఒక్కో షేరుకు రూ.28.01)గా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.19,299 కోట్ల (ఒక్కో షేరుకు రూ.28.52) తో పోలిస్తే ఈసారి అతి స్వల్పంగా తగ్గింది. త్రైమాసికం వారీగా అంటే అక్టోబరు-డిసెంబరు లాభం రూ.17265 కోట్లతో పోలిస్తే పెరిగింది.

త్రైమాసిక ఎబిటా (వడ్డీ, పన్నులు, తరుగుదల, తనఖాకు ముందు లాభం) 14.3% పెరిగి రూ.47,150 కోట్లుగా నమోదైంది. అన్ని వ్యాపారాల్లో వృద్ధి కనిపించడంతో కార్యకలాపాల ఆదాయం సైతం 11% పెరిగి రూ.2.64 లక్షల కోట్లకు చేరింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి

గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డులు సృష్టించింది. నికర లాభం రూ.69,621 కోట్లుగా నమోదైంది. ఇప్పటిదాకా ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా సంస్థ ఆర్జించిన అత్యధిక లాభం ఇదే. 2022-23లో లాభం రూ.66,702 కోట్లుగా ఉంది. టర్నోవరు కూడా రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. 2022-23లో రూ.9.74 లక్షల కోట్లుగా ఉన్న టర్నోవరు, 2023-24లో 2.6% పెరిగి రూ.10 లక్షల కోట్లుగా నమోదైంది.

పెరిగిన జియో వినియోగదార్లు

రిలయన్స్‌ జియో వినియోగదార్లు 2023 డిసెంబరు చివరకు 47.09 కోట్లుగా ఉండగా.. 2024 మార్చి ఆఖరుకు 48.18 కోట్లకు చేరారు. సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెద్దగా మార్పు లేకుండా రూ.181.7గా నిలిచింది. మార్చి త్రైమాసికంలో జియో ఇన్ఫోకామ్‌ నికర లాభం 12% వృద్ధితో రూ.5,583 కోట్లకు చేరుకుంది. స్థూల ఆదాయం 13% పెరిగి రూ.33,835 కోట్లకు చేరగా.. కార్యకలాపాల ఆదాయం 13.4% వృద్ధితో రూ.28,871 కోట్లకు పెరిగింది. డేటా రద్దీ 40.9 బిలియన్‌ జీబీలుగా నమోదైంది. డిసెంబరు త్రైమాసికంలో ఇది  38.1 బిలియన్‌ జీబీలుగా ఉంది.

  • పూర్తి ఆర్థిక సంవత్సరానికి జియో రూ.21,424 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2022-23లో రూ.19,124 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
  • దేశవ్యాప్తంగా జియో 5జీ వినియోగదార్ల సంఖ్య 10.8 కోట్లకు పైగా నమోదైంది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ వినియోగదార్లున్న ఆపరేటరు జియోనే.
  • జియో ప్లాట్‌ఫామ్స్‌ పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయం 11.6% వృద్ధితో రూ.1,09,558 కోట్లకు చేరింది.
  • జియో ఎండీల్లో ఒకరైన సంజయ్‌ మశ్రువాలా(76) రాజీనామా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈయన ధీరూభాయ్‌ సమయం నుంచీ కంపెనీలో ఉన్నారు.

రూ.3 లక్షల కోట్లకు ‘రిటైల్‌’ స్థూల ఆదాయం

జనవరి-మార్చిలో రిటైల్‌ వ్యాపారంలో లాభం, అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 11.7% పెరిగి రూ.2,698 కోట్లకు చేరుకుంది. కొత్త స్టోర్లు 562 జతకావడంతో మొత్తం సంఖ్య 18,836కు చేరుకుంది. 2023-24 మొత్తంమీద రిటైల్‌ వ్యాపార స్థూల ఆదాయం రూ.3 లక్షల కోట్లను అధిగమించింది. మార్చి త్రైమాసికంలో ఆదాయం 10.6% పెరిగి రూ.76,627 కోట్లకు చేరుకుంది.

చమురు విభాగంలో..

రిలయన్స్‌ ప్రధాన వ్యాపారమైన చమురు రిఫైనింగ్‌-పెట్రోరసాయనాల వ్యాపారం(ఓ2సీ) ఆదాయం నాలుగో త్రైమాసికంలో 11% పెరిగి రూ.1,42,634 కోట్లకు చేరుకుంది. ఎబిటా 3% వృద్ధి చెందింది. చమురు-గ్యాస్‌ ఎబిటా 47.5% పెరిగి రూ.5,606 కోట్లకు చేరుకుంది. కేజీ-డి6 బ్లాక్‌లో ప్రస్తుతం రోజుకు 30 మిలియన్‌ ఘనపు మీటర్ల గ్యాస్‌, 23,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది.

అప్పులు పెరిగాయ్‌

2023 డిసెంబరు చివరకు కంపెనీకి రూ.3.11 లక్షల కోట్ల రుణాలుండగా.. 2024 మార్చి ఆఖరుకు ఇవి రూ.3.24 లక్షల కోట్లకు పెరిగాయి. నికర రుణాలు ఏడాది కిందటితో పోలిస్తే రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.1.16 లక్షల కోట్లకు తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని