ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ సీఈఓ సందీప్‌ కల్రా వెల్లడించారు.

Published : 24 Apr 2024 02:32 IST

పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ సీఈఓ సందీప్‌ కల్రా

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ సీఈఓ సందీప్‌ కల్రా వెల్లడించారు. ‘మాకు లభించే ఆర్డర్లు, వ్యాపారం ఆధారంగా ఉద్యోగుల’ను నియమించుకుంటామని తెలిపారు. అంతర్జతీయంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో, ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గడాన్ని ప్రస్తావించారు. లాభదాయకత కంటే వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సందీప్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 700 మంది తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్‌)కు ఆఫర్‌ లెటర్లు అందించగా, ఇప్పటికే వారిలో 500 మంది సంస్థలో చేరారని తెలిపారు. ‘మేము ఇచ్చిన ఆఫర్లకు ఎంత నిబద్ధతతో కట్టుబడి ఉంటామో ఇది తెలియజేస్తుంది. మిగతా 200 మంది కూడా వచ్చే 3-4 నెలల్లో ఉద్యోగాల్లో చేరతార’ని కల్రా వెల్లడించారు. భవిష్యత్తు వ్యాపారంపై స్పష్టత వచ్చాక, కొత్త నియామకాలపై ఆలోచిస్తామని వివరించారు. ప్రాంగణ ఎంపికలు చేసి, ఆఫర్‌ లెటర్లు ఇవ్వాలన్న తాపత్రయం లేదని స్పష్టం చేశారు. 12 నెలల కాలానికి ముందుగానే ఆఫర్‌ లెటర్లు ఇవ్వలేమని తెలిపారు.

  • ఈ ఏడాది మార్చి 24 నాటికి పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 23,850గా ఉంది. ఏడాది క్రితం ఇదే సమయానికి ఉద్యోగుల సంఖ్య 22,889 మాత్రమే.
  • మధ్య కాలానికి నిర్వహణ లాభం మార్జిన్‌ పెంచుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. 2023-24 మార్చి త్రైమాసికంలో ఇది 14.5 శాతంగా ఉంది. మార్జిన్‌ మరో 2-3% పెంచుకోవడంతో పాటు, ఆదాయాన్ని 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది.
  • మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 25.4% పెరిగి రూ.315.32 కోట్లకు, ఆదాయం 14.9 శాతం పెరిగి రూ.2,590 కోట్లకు చేరింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని