టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లాభం రూ.212 కోట్లు

కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది

Published : 24 Apr 2024 02:33 IST

దిల్లీ: టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.289.56 కోట్లతో పోలిస్తే ఇది 26.69% తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఏకీకృత ఆదాయం మాత్రం రూ.3,618.73 కోట్ల నుంచి రూ.3,926.94 కోట్లకు పెరిగింది. దేశీయంగా ప్యాకేజ్డ్‌ బెవరేజెస్‌ వ్యాపార ఆదాయ వృద్ధి 2%, ఆహార పదార్థాల వ్యాపారం 20%; అంతర్జాతీయ వ్యాపారాదాయం 7% పెరిగినట్లు సంస్థ తెలిపింది. టాటా స్టార్‌బక్స్‌ కొత్తగా 6 నగరాలకు విస్తరించడంతో పాటు మరో 29 విక్రయశాలలను సమీక్షా త్రైమాసికంలో ఏర్పాటు చేసింది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,215.4 కోట్లుగా నమోదైంది. 2022-23లో ఇది రూ.1,320.14 కోట్లుగా ఉంది.. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.13,783.16 కోట్ల నుంచి రూ.15,205.85 కోట్లకు పెరిగింది.
  • ‘గత ఆర్థిక సంవత్సరంలో టీ, ఉప్పు విభాగాల్లో ప్రీమియం ఉత్పత్తులు తీసుకురావడంతో మంచి వృద్ధి కనిపించింది. మొత్తం పోర్ట్‌ఫోలియోలో వీటి వాటా పెరిగింద’ని టీసీపీఎల్‌ ఎండీ, సీఈఓ సునీల్‌ డిసౌజా వెల్లడించారు. ఇటీవల కొనుగోలు చేసిన క్యాపిటల్‌ ఫుడ్స్‌, ఆర్గానిక్‌ ఇండియా సంస్థలు  విలువను జత చేస్తాయని పేర్కొన్నారు. ఆర్గానిక్‌ ఇండియా విలీన ప్రక్రియ ఈ నెల 16న పూర్తికాగా, క్యాపిటల్‌ ఫుడ్స్‌ ప్రక్రియ 60 రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని