సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్‌గ్లోబ్‌ భాగస్వామ్యం

టెక్‌ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్‌ ‘అలాన్‌ఓఎస్‌’ను ఏర్పాటు చేసింది.

Published : 24 Apr 2024 02:34 IST

ఏఐ బిజినెస్‌ వెంచర్‌ ఏర్పాటు
ప్రపంచవ్యాప్తంగా ‘అలాన్‌ఓఎస్‌’ సేవలు

దిల్లీ: టెక్‌ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్‌ ‘అలాన్‌ఓఎస్‌’ను ఏర్పాటు చేసింది. ఏఐ ఆధారిత సొల్యూషన్లతో మానవ, సిస్టమ్‌ సామర్థ్యాలను పెంచడం ద్వారా కంపెనీలు  డిజిటల్‌ మార్పును వేగంగా చేపట్టడానికి అలాన్‌ఓఎస్‌ సహకరిస్తుందని ఇంటర్‌గ్లోబ్‌ గ్రూప్‌ ఎండీ రాహుల్‌ భాటియా పేర్కొన్నారు. ఈ కంపెనీ సేవలందించదగ్గ మార్కెట్‌ స్థాయి 150 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.12.45 లక్షల కోట్ల) వరకు ఉంటుందని గుర్నానీ పేర్కొన్నారు. అలాన్‌ఓఎస్‌కు గుర్నానీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంటర్‌గ్లోబ్‌ మెజారిటీ భాగస్వామిగా ఉండే అలాన్‌ఓఎస్‌కు సింగపూర్‌లో ప్రధాన కార్యాలయం ఉంటుంది. పరిశ్రమ నిర్దేశిత ఉత్పత్తులు, ఏఐ కస్టమ్స్‌ సొల్యూషన్లను ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ అందిస్తుంది. ఇందుకోసం అంకురాలతో భాగస్వామ్యం కోసమూ చూస్తోంది.

హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌: అలాన్‌ఓఎస్‌కు చెందిన ఒక కేంద్రం గురుగ్రామ్‌లో ఉంది. ఒకట్రెండు నెలల్లో హైదరాబాద్‌తో పాటు చెన్నైలోనూ ఒక్కో కేంద్రం నెలకొల్పుతామని గుర్నానీ తెలిపారు. ‘ప్రపంచం వేగంగా మారుతోంది. కంపెనీలు తమను తాము పునర్‌ నిర్వచించుకోవాల్సి ఉంటుంది. ఏఐతో అది సాధ్యం. విమానయానానికే కాదు.. అన్ని పరిశ్రమల్లోనూ మేం సేవలందిస్తామ’ని గుర్నానీ పేర్కొన్నారు.

భారత్‌తో పాటు ఇతర దేశాల్లో..: భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, ఐరోపా, పశ్చిమాసియాలోనూ అలాన్‌ఓఎస్‌ కార్యకలాపాలు నిర్వహించనుంది. టీటీఎల్‌హెచ్‌(ప్రయాణం, రవాణా, ఆతిథ్యం)తో మొదలుపెట్టి ఇతర రంగాల్లోని కంపెనీలకూ సేవలు విస్తరిస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని