నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్‌50లో డెరివేటివ్‌ కాంట్రాక్టుల ట్రేడింగ్‌

నిఫ్టీ నెక్స్ట్‌ 50 సూచీలో డెరివేటివ్‌ కాంట్రాక్టులను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) బుధవారం ప్రారంభించనుంది.

Published : 24 Apr 2024 02:36 IST

అక్టోబరు 31 వరకు లావాదేవీ రుసుములు ఉండవు: ఎన్‌ఎస్‌ఈ

దిల్లీ: నిఫ్టీ నెక్స్ట్‌ 50 సూచీలో డెరివేటివ్‌ కాంట్రాక్టులను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) బుధవారం ప్రారంభించనుంది. నిఫ్టీ 100 సూచీలో నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగతా కంపెనీల షేర్లు నిఫ్టీ నెక్స్ట్‌ 50 సూచీలో ఉంటాయి. ఈ సూచీకి వరుసగా 3 నెలలకు ఫ్యూచర్స్‌, ఆప్షన్ల కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు ఎక్స్ఛేంజీ అందుబాటులో ఉంచుతుంది. ప్రతి నెలా చివరి శుక్రవారం ఆయా నెలల కాంట్రాక్టులకు గడువు తీరుతుంది.

  • నిఫ్టీ నెక్స్ట్‌ 50 సూచీ ఫ్యూచర్స్‌, ఆప్షన్‌ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌కు 2024 ఏప్రిల్‌ 24 నుంచి 2024 అక్టోబరు 31 వరకు లావాదేవీ రుసుములు ఉండవని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఈ సూచీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ చేసేలా మదుపర్లను ప్రోత్సహించాలన్నదే దీని వెనక ఉద్దేశమని పేర్కొంది.
  • ‘ఇప్పుడున్న సూచీల డెరివేటివ్స్‌ ఉత్పత్తులకు అదనంగా నిఫ్టీ నెక్స్ట్‌ 50 సూచీ డెరివేటివ్స్‌ చేరనుంది. పెద్ద కంపెనీలు, ఎక్కువ ట్రేడింగ్‌ లావాదేవీలు జరిగే షేర్లున్న నిఫ్టీ 50 సూచీ.. మధ్య తరహా కంపెనీలు, ఎక్కువ ట్రేడింగ్‌ లావాదేవీలు జరిగే షేర్లున్న నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీల మధ్య ఖాళీని నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీ పూరిస్తుంద’ని ఎన్‌ఎస్‌ఈ ముఖ్య వ్యాపార అభివృద్ధి అధికారి శ్రీరామ్‌ కృష్ణన్‌ తెలిపారు. 2024 మార్చి చివరికి నిఫ్టీ నెక్స్ట్‌ సూచీలో ఆర్థిక సేవల రంగానికి అత్యధికంగా 23.76% వాటా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో భారీ యంత్ర పరికరాలు (11.91%), వినియోగదారు సేవలు (11.57%) ఉన్నాయి. 2024 మార్చి 29 నాటికి  నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.70 లక్షల కోట్లు. ఎన్‌ఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువలో ఇది సుమారు 18%. ఈ సూచీలోని కంపెనీల రోజువారీ సగటు ట్రేడింగ్‌ టర్నోవరు రూ.9,560 కోట్లు. 2023-24లో నమోదైన మొత్తం క్యాష్‌ మార్కెట్‌ టర్నోవరులో ఈ విలువ సుమారు 12%.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని