ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు

దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్‌ బులెటిన్‌ అభిప్రాయ పడింది.

Published : 24 Apr 2024 02:38 IST

ఆర్‌బీఐ ఏప్రిల్‌ బులెటిన్‌

ముంబయి: దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్‌ బులెటిన్‌ అభిప్రాయ పడింది. గత నెలలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.9 శాతానికి దిగి వచ్చింది. దీనికి ముందు రెండు నెలల సరాసరి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమయంలో సీపీఐ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. 2023 ఫిబ్రవరి నుంచి ద్రవ్యోల్బణ భయాలతో వడ్డీ రేట్లను మార్చకుండా 6.5 శాతం వద్దే ఆర్‌బీఐ ఉంచింది.  ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ పేరుతో ఆర్‌బీఐ ప్రచురించిన తాజా వ్యాసంలో.. అంతర్జాతీయ వృద్ధి 2024 తొలి త్రైమాసికంలో స్థిరంగా కొనసాగిందని పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం సానుకూలంగా మారిందనీ తెలిపింది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ట్రెజరీ ప్రతిఫలాలు, తనఖా రేట్లు పెరగడంతో, వడ్డీ రేట్లను తగ్గించొచ్చనే అంచనాలు వస్తున్నాయి. మనదేశంలోకి పెట్టుబడులు అధికంగా వస్తుండటం, వ్యాపార, వినియోగదారు సెంటిమెంట్‌తో వాస్తవిక జీడీపీ పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అయితే వాతావరణ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళననూ వ్యక్తం చేసింది. ఇందులో వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నీ రచయితల వ్యక్తిగత అభిప్రాయాలేనని, ఆర్‌బీఐకు సంబంధం లేదని వ్యాసం పేర్కొంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్రా నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్‌లో వ్యాసాలు రాసింది. దీని ప్రకారం..

వర్షపాతం బాగుంటే..: 2024 వసంత కాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ వాతావరణ ఏజెన్సీలు కూడా 1850 నుంచి చూస్తే ఈ మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపాయి. 1880-1899 సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే 1.6 డిగ్రీల సెల్సియస్‌ (3.01 డిగ్రీల ఫారిన్‌హీట్‌) ఎక్కువగా ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసినట్లు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతే, ఆహార పదార్థాల ధరలపై ఒత్తిళ్లు తగ్గుతాయి. స్వల్ప కాలంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తితే, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

రుణ వృద్ధి వార్షిక ప్రాతిపదికన పెరిగిందని, ప్రైవేటు రంగ బ్యాంకుల (పీవీబీలు) వద్ద ఇది అధికంగా (19.3%) ఉందని బులెటిన్‌ తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) వద్ద రుణ వృద్ధి 14.7 శాతంగా ఉంది.ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే పీఎస్‌బీల్లో రుణ రేట్లు తక్కువగా, డిపాజిట్‌ రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు