మా ఉత్పత్తులపై నిషేధం లేదు

తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్‌-మిక్స్‌ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్‌, హాంకాంగ్‌ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది.

Published : 24 Apr 2024 02:43 IST

అన్నీ భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవే
ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌  

దిల్లీ: తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్‌-మిక్స్‌ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్‌, హాంకాంగ్‌ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. సింగపూర్‌, హాంకాంగ్‌లలో ఎవరెస్ట్‌ ఉత్పత్తులపై నిషేధం లేదనీ సంస్థ తెలిపింది. ‘ఎవరెస్ట్‌ ఉత్పత్తులు మొత్తం 60 ఉంటే, కేవలం ఒకదాన్నే పరీక్షించారు. ప్రామాణిక ప్రక్రియలోనే అదీ జరిగింది కానీ నిషేధం విధించలేద’ని మంగళవారం కంపెనీ వివరించింది. ఆహార భద్రత కంపెనీకి అత్యంత ప్రాధాన్య విషయమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్పైస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ల్యాబ్‌ల నుంచి అవసరమైన అనుమతులు లభించాకే, ఎగుమతులు జరుగుతాయని వివరించారు. 50 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న బ్రాండ్‌గా తయారీ సదుపాయాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని.. పలు జాతీయ, అంతర్జాతీయ ధ్రువీకరణలూ పొందినట్లు తెలిపారు.

ఏం జరిగిందంటే: ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ భారతీయ బ్రాండ్లకు చెందిన ప్రీ-ప్యాకేజ్డ్‌ స్పైస్‌ మిక్స్‌ ఉత్పత్తుల శాంపిళ్లలో అనుమతించిన పరిమితికి మించి ‘ఎథిలీన్‌ ఆక్సైడ్‌’ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) ఏప్రిల్‌ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్‌ఎస్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ రీకాల్‌ చేసింది. అందులో ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్‌, సాంబార్‌ మసాలా మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌, కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌మసాలా పౌడర్‌లు ఉన్నాయి.

వివరాలు కోరిన భారత్‌: ఈ పరిణామాలపై సింగపూర్‌, హాంకాంగ్‌కు చెందిన ఆహార భద్రత నియంత్రణల సంస్థల నుంచి మనదేశం వివరాలు కోరింది. అన్ని వివరాలు సమర్పించాలని ఎమ్‌డీహెచ్‌, ఎవరెస్ట్‌ కంపెనీలనూ ఆదేశించింది. ఉత్పత్తుల తిరస్కరణకు కారణాలు, చేపడుతున్న దిద్దుబాటు చర్యలను తెలపాలంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని