మూడో రోజూ ముందుకే

వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి.

Published : 24 Apr 2024 02:49 IST

సమీక్ష

రుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ పరిణామాలూ ప్రభావం చూపాయి.  డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.31 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.41% లాభంతో 87.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 74,048.94 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. గరిష్ఠాల్లో లాభాల స్వీకరణతో ఒకదశలో సూచీ 73,688.31 పాయింట్లకు చేరింది. చివరకు 89.83 పాయింట్ల లాభంతో 73,738.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.60 పాయింట్లు పెరిగి 22,368 దగ్గర స్థిరపడింది.

  • వొడాఫోన్‌ ఐడియా ఎఫ్‌పీఓ ధరను ఒక్కో షేరుకు రూ.11గా నిర్ణయించింది. ఎఫ్‌పీఓ ద్వారా రూ.18,000 కోట్లను విజయవంతంగా సమీకరించడంతో వొడాఫోన్‌ ఐడియా షేరు మంగళవారం 11.64% పరుగులు తీసి రూ.14.39 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.7,517.98 కోట్లు పెరిగి     రూ.72,122.42 కోట్లకు చేరింది.
  • త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఇంట్రాడేలో రూ.2,986.05 వద్ద గరిష్ఠాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరకు 1.42% నష్టపోయి    రూ.2,918.50 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.28,607.45 కోట్లు తగ్గి రూ.19.74 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 లాభాలు నమోదుచేశాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 3.38%, మారుతీ 1.68%, నెస్లే 1.64%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.42%, టాటా మోటార్స్‌ 1.34%, ఏషియన్‌ పెయింట్స్‌      1.14%, ఎన్‌టీపీసీ 1.12% లాభపడ్డాయి. సన్‌ఫార్మా 3.63%, ఎం అండ్‌ ఎం 1.37%, టెక్‌ మహీంద్రా 0.63% డీలాపడ్డాయి.
  • ఒక కంపెనీ శాఖలో రూ.150 కోట్ల రిటైల్‌ వాహన రుణ మోసాన్ని గుర్తించినట్లు మహీంద్రా ఫైనాన్స్‌ తెలిపింది. దీంతో 2023-24 ఆర్థిక ఫలితాలను ఆమోదించేందుకు ఏర్పాటు చేసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేసినట్లు పేర్కొంది. ఫలితాలను మే 30న ప్రకటించనున్నట్లు తెలిపింది. బీఎస్‌ఈలో మంగళవారం ఎం అండ్‌ ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు 5.47% కోల్పోయి రూ.263.60 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,884.18 కోట్లు తగ్గి రూ.32,568.57 కోట్లకు పరిమితమైంది.
  • రిలయన్స్‌ పెట్టుబడుల ప్రతిపాదనకు ఆమోదం: బంగాళాఖాతంలోని కేజీ-డీ6 బ్లాక్‌లో గ్యాస్‌ నిల్వలను మరింతగా వెలికి తీసేందుకు, అదనపు పెట్టుబడులు పెట్టాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. దీంతో రోజువారీ ఉత్పత్తి 4-5 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల మేర పెరుగుతుందని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌  రాయ్‌ తెలిపారు.
  • నిర్మాణ సంస్థ పటేల్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌, క్యూఐపీ ఇష్యూను ప్రారంభించింది. ఒక్కో షేరు కనీస ధరగా రూ.59.50 నిర్ణయించింది.
  • బజాజ్‌ ఆటో విద్యుత్‌ వాహన విభాగం చేతక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఎండీగా అబ్రహం జోసెఫ్‌ నియమితులయ్యారు. కంపెనీలో ఆయనకు 35 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. బజాజ్‌ ఆటో చీఫ్‌ టెక్నాలజీ అధికారిగా రామ్‌తిలక్‌ అనంతన్‌ను నియమించింది.
  • బైజూస్‌ రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగంపై నమోదైన కేసు విచారణను జూన్‌ 6కు ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్‌ వాయిదా వేసింది.
  • రూ.133 నుంచి అంతర్జాతీయ రోమింగ్‌ ప్యాక్‌లను భారతీ ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. ఈ కొత్త ప్యాక్‌లు 184 దేశాల్లో పనిచేస్తాయి. రోజుకు రూ.133 నుంచి టారిఫ్‌ ప్రారంభమవుతుంది. డేటా ప్రయోజనాలు, విమానంలో వాడుకునే సదుపాయం, నిరంతర కాంటాక్ట్‌ సెంటర్‌ తోడ్పాటు వంటివి లభిస్తాయి.
  • 2023 డిసెంబరు త్రైమాసికంలో టెలికాం సేవల రంగ సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) రూ.67,835 కోట్లుగా నమోదైంది. అంతక్రితం సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఇది 1.8 శాతం ఎక్కువ.  
  • రక్తంలో పీహెచ్‌ఈ స్థాయులను తగ్గించేందుకు వినియోగించే ఔషధాలను ఆరు లాట్‌ల మేర అమెరికా విపణి నుంచి స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది.

నేటి బోర్డు సమావేశాలు: హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, దాల్మియా భారత్‌, ఈక్విటాస్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని