ఇస్రో కోసం ఇంటర్‌ట్యాంక్‌ స్ట్రక్చర్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 లాంచ్‌ వెహికల్‌ కోసం ఇంటర్‌ట్యాంక్‌ స్ట్రక్చర్‌ (ఐటీఎస్‌)ను ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ రూపొందించింది.

Published : 24 Apr 2024 02:50 IST

ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ అరుదైన ఘనత  

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 లాంచ్‌ వెహికల్‌ కోసం ఇంటర్‌ట్యాంక్‌ స్ట్రక్చర్‌ (ఐటీఎస్‌)ను ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ రూపొందించింది. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.ఉన్నికృష్ణన్‌కు దీన్ని మంగళవారం సాయంత్రం ‘వర్చువల్‌’ పద్ధతిలో ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.విద్యాసాగర్‌ అందజేశారు. ఐటీఎస్‌ను ఇస్రో ప్రమాణాల ప్రకారం రూపొందించి, అందజేసిన తొలి ప్రైవేటు రంగ సంస్థ, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ కావడం ప్రత్యేకత. దీన్ని హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉన్న ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌కు చెందిన యూనిట్లో, ఇస్రో ఇంజినీర్ల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసి అసెంబుల్‌ చేశారు.

ఇదీ ప్రత్యేకత: ‘గగన్‌యాన్‌’ ప్రయోగానికి, 4 టన్నుల తరగతికి చెందిన జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీఓ) ఉపగ్రహ ప్రయోగాలకు జీఎస్‌ఎల్‌ మార్క్‌-3 లాంచ్‌ వెహికల్‌ను ఇస్రో వినియోగిస్తోంది. అందువల్ల లాంచ్‌ వెహికల్‌ పే-లోడ్‌ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐటీఎస్‌ ఐసోగ్రిడ్‌ వెర్షన్‌ ను ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ రూపొందించింది. ఇస్రో భవిష్యత్తులో నిర్వహించే ప్రయోగాలకు దీన్ని ఫ్యాబ్రికేట్‌ చేసి, సరఫరా చేసే అవకాశాన్నీ సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఎన్నో ఏళ్లుగా ఇస్రోకు లాంచ్‌ వెహికల్‌/ రాకెట్‌ సిస్టమ్స్‌ను సరఫరా చేస్తోంది. చంద్రయాన్‌, గగన్‌యాన్‌, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో భాగస్వామిగా ఉంది.

లాంచ్‌ వెహికల్‌ ఎల్‌ 110 నుంచి సి 25 స్టేజ్‌ మధ్యలో ఇంటర్‌ఫేస్‌గా ఐటీఎస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. సంప్రదాయ ‘స్కిన్‌ స్ట్రింజర్‌ రివిటెడ్‌ అసెంబ్లీ’ విధానానికి బదులు ‘ఐసోగ్రిడ్‌ అసెంబ్లీ’ విధానాన్ని అనుసరించడం వల్ల లాంచ్‌ వెహికల్‌ పేలోడ్‌ సామర్థ్యం పెరుగుతుంది. 2.7 మీటర్ల    ఎత్తైన ఐసోగ్రిడ్‌ ప్యానెళ్లను సిద్ధం చేయడం, రాకెట్‌ విడిపోయే ఓరియంటేషన్‌ దశను నియంత్రించడం, ఫిల్‌ అండ్‌ డ్రెయిన్‌ బ్రాకెట్లు, లైన్‌ బ్రాకెట్ల తయారీ దీని రూపకల్పనలో ఎదురయ్యే ముఖ్యమైన సవాళ్లు. వీటిని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ అధిగమించి ఇంటర్‌ట్యాంక్‌ స్ట్రక్చర్‌ (ఐటీఎస్‌)ను తయారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని