సంక్షిప్త వార్తలు

ఈ ఏడాదిలో ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ఫీడ్‌స్టాక్‌గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్‌ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Published : 25 Apr 2024 01:58 IST

ఇథనాల్‌ తయారీకి 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్‌
ప్రభుత్వ అనుమతి

దిల్లీ: ఈ ఏడాదిలో ఇథనాల్‌ ఉత్పత్తి కోసం ఫీడ్‌స్టాక్‌గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్‌ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చక్కెర ఉత్పత్తి సమయంలో విడుదలయ్యే బి-హెవీ మొలాసిస్‌ అదనపు నిల్వలు ప్రస్తుతం మిల్లుల వద్ద ఉన్నాయి. ఇథనాల్‌ ఉత్పత్తికి దీనిని వినియోగించొద్దని గతేడాది డిసెంబరు 7న ప్రభుత్వం నిషేధం విధించినా, వారం తర్వాత ఆ ఉత్తుర్వులను వెనక్కి తీసుకుంది. అయితే 2023-24 సరఫరా ఏడాది (నవంబరు-డిసెంబరు)లో ఇథనాల్‌ ఉత్పత్తి కోసం 17 లక్షల టన్నుల చక్కెరను వినియోగించేందుకే అనుమతించింది. తాజాగా ఇథనాల్‌ ఉత్పత్తికి బి-హెవీ మొలాసిస్‌ వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చామని, పెట్రోలియం శాఖకు ఈ విషయాన్ని చేరవేశామని ఆహార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 17 లక్షల టన్నుల చక్కెర పరిమితికి ఇది అదనమని అన్నారు.


ఆ ప్రకటనలు నమ్మొద్దు: ఎల్‌ఐసీ

ఈనాడు, హైదరాబాద్‌: పలు సామాజిక మాధ్యమాల్లో తమ పేరుతో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ప్రజలకు సూచించింది. కొందరు వ్యక్తులు, సంస్థలు ఎల్‌ఐసీ పేరుతో వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, మాజీ ఉద్యోగుల చిత్రాలతో పాటు, సంస్థ పేరు, లోగో వినియోగించి, ఆయా ప్రకటనలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ తరహా ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, పాలసీదారులకు ఎల్‌ఐసీ సూచించింది. ఇలాంటి వాటిని గుర్తించిన వెంటనే ఎల్‌ఐసీ అధికారిక సామాజిక వేదికలపై ఫిర్యాదు చేయాలని తెలిపింది. మోసపూరితంగా ప్రవర్తించిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు, పాలసీదారులు అధీకృత సమాచారం కోసం ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌, సేవా కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపింది.


ఉద్యోగులందరికీ వాటాలు: క్రిటికల్‌రివర్‌

హైదరాబాద్‌ (బేగంపేట), న్యూస్‌టుడే: సాంకేతిక సేవల సంస్థ క్రిటికల్‌రివర్‌ తన ఉద్యోగులందరికీ సంస్థలో వాటాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులందరికీ సంస్థలో యాజమాన్యం ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అంజి మారం, సీఎఫ్‌ఓ చంద్ర చంద్రగిరి బుధవారం ఇక్కడ తెలిపారు.  ప్రపంచ వ్యాప్తంగా తమ 9 కేంద్రాల్లో 1,000 మందికి పైగా ఉద్యోగులున్నారని, వీరందరికీ ఎంప్లాయి స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఈఎస్‌ఓపీ) ద్వారా షేర్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగి పనిచేసిన కాలానికి ఏడాదికి 100 షేర్ల చొప్పున, పనితీరు ఆధారంగా మరికొన్ని షేర్లూ ఇస్తామని పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే సంస్తృతిని పెంపొందించడం, ఉద్యోగులకు సాధికారత, సంస్థ విజయాల్లో వారిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఆదాయం రూ.500 కోట్ల మేరకు ఉందని, 2030 నాటికి రూ.4వేల కోట్ల స్థాయికి చేర్చాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఐపీఓకి వస్తామని అంజి మారం  తెలిపారు.


లీ కూపర్‌ నుంచి పర్యావరణహిత జీన్స్‌

హైదరాబాద్‌: ప్రముఖ డెనిమ్‌ బ్రాండ్‌ లీ కూపర్‌ పర్యావరణహిత జీన్స్‌ కలెక్షన్‌ను తీసుకొచ్చింది. రీసైకిల్‌ చేసిన సిగరెట్‌ పీకల్లోని పదార్థంతో ఈ జీన్స్‌ను తయారు చేశామని, ప్రపంచంలో ఇది తొలిసారని కంపెనీ తెలిపింది. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్సి పురస్కరించుకుని కంపెనీ ఈ కలెక్షన్‌ విడుదల చేసింది. భారత్‌లో కంటెంట్‌ సృష్టికర్తలకు ఈ కలెక్షన్‌ను లీ కూపర్‌ అంకితమిచ్చింది. కంటెంట్‌ సృష్టికర్తలు కేవలం ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కాదని, ఎకోఇన్‌ఫ్లూయెన్సర్‌లని అభివర్ణించింది. ధానేలోని లీ కూపర్‌ ప్రత్యేక స్టోర్‌లో డిజైనర్‌ కరణ్‌ కుంద్రా ఈ కలెక్షన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 60కు పైగా కంటెంట్‌ సృష్టికర్తలు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు