యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.7,599 కోట్లు

ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 25 Apr 2024 02:02 IST

ముంబయి: ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాలంలో రూ.5,728.42 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. సిటీబ్యాంక్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసిన ఫలితంగా, 2022-23 మార్చి త్రైమాసికంతో పాటు ఆ ఆర్థిక సంవత్సర గణాంకాల పైనా ప్రభావం పడిందని యాక్సిస్‌ బ్యాంక్‌ వివరించింది. 2023-24 మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.35,990 కోట్లకు పెరిగింది. 2022-23 ఇదే కాల ఆదాయం రూ.28,758 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 11% పెరిగి రూ.13,089 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 41% పెరిగి రూ.6,766 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 0.05% పెరిగి 4.06 శాతానికి చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 2.02% నుంచి 1.43 శాతానికి తగ్గాయి.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ నికర లాభం 160% వృద్ధితో రూ.24,861.43 కోట్లకు చేరింది. మొత్తం వ్యాపారం 12% పెరిగి 2024 మార్చి 31కి రూ.14,77,209 కోట్లకు చేరింది.
  • సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ 12.4 లక్షల క్రెడిట్‌ కార్డులు జారీ చేసింది. గత 9 త్రైమాసికాల్లో దేశంలో అత్యధిక క్రెడిట్‌ కార్డ్‌లు జారీ చేసింది తమ బ్యాంకేనని ఎక్స్ఛేంజీలకు యాక్సిస్‌ బ్యాంక్‌ సమాచారమిచ్చింది.
  • సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ కొత్తగా 125 శాఖలను, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 475 శాఖలను ప్రారంభించింది. దీంతో దేశీయంగా మొత్తం శాఖల సంఖ్య 5,377కు చేరింది.
  • సిటీ బ్యాంక్‌ వ్యాపార కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందని, వచ్చే 6 నెలల్లో ఆ బ్యాంక్‌ అనుసంధానం పూర్తవుతుందని యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అమితాబ్‌ చౌధ్రీ వెల్లడించారు. గత ఏడాది సిటీ బ్యాంక్‌కు చెందిన భారత కన్జూమర్‌ వ్యాపారాన్ని సిటీ బ్యాంక్‌ ఎన్‌.ఎ. నుంచి, ఎన్‌బీఎఫ్‌సీ కన్జూమర్‌ వ్యాపారాన్ని సిటీకార్ప్‌ ఫైనాన్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేసింది.
  • రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1 చొప్పున (50%) డివిడెండ్‌ను బ్యాంక్‌ బోర్డు ప్రతిపాదించింది. బీఎస్‌ఈలో బుధవారం యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 0.69% పెరిగి రూ.1,063.70 వద్ద ముగిసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని