హెచ్‌యూఎల్‌ లాభంలో స్వల్ప క్షీణత

ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.

Published : 25 Apr 2024 02:03 IST

మొత్తం డివిడెండు రూ.42

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.2,601 కోట్ల కంటే ఇది 1.53% తక్కువ. నికర విక్రయాలు దాదాపు మార్పు లేకుండా రూ.15,013 కోట్లుగా నమోదయ్యాయి. ప్రతి ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరలు తగ్గడం ఈ ఫలితాలకు నేపథ్యమని సంస్థ పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం వ్యయాలు 1.15% పెరిగి రూ.12,100 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం రూ.15,375 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.15,441 కోట్లకు చేరుకుంది. మార్చి త్రైమాసికంలో స్థూల మార్జిన్‌ 350 బేసిస్‌ పాయింట్ల మేర మెరుగైంది.

విభాగాల వారీగా: గృహ సంరక్షణ విభాగం 1.27% వృద్ధి చెంది రూ.5,709 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

  • సౌందర్య ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ విభాగాదాయం 2.5% పెరిగి రూ.5125 కోట్లకు చేరుకుంది.
  • ఆహార-రిఫ్రెష్‌మెంట్‌ విభాగ ఆదాయం 3% హెచ్చి రూ.3,910 కోట్లుగా ఉంది.
  • ఇతర విభాగాల ఆదాయం (ఎగుమతులు, కన్‌సైన్‌మెంట్‌ సహా) 11.6% తగ్గి రూ.466 కోట్లకు పరిమితమైంది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.10,282 కోట్లుగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సర లాభం రూ.10,143 కోట్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.61,092 కోట్ల నుంచి రూ.62,707 కోట్లకు పెరిగింది. కంపెనీ 2023-24లో మెరుగైన పనితీరును కనబరచిందని ఫలితాల సందర్భంగా కంపెనీ సీఈఓ, ఎండీ రోహిత్‌ జావా పేర్కొన్నారు.

తుది డివిడెండు రూ.24: తుది డివిడెండు రూ.24ను హెచ్‌యూఎల్‌ బోర్డు ప్రతిపాదించింది. దీనికి వాటాదార్ల అనుమతి లభించాల్సి ఉంది. రూ.18 మధ్యంతర డివిడెండుతో కలిపి మొత్తం డివిడెండు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.42కు చేరుతుంది. 2022-23తో పోలిస్తే ఇది 8% ఎక్కువ.

బీఎస్‌ఈలో బుధవారం కంపెనీ షేరు 0.16% తగ్గి రూ.2259.15 వద్ద స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని