4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం

సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.

Published : 25 Apr 2024 02:03 IST

సమీక్ష

సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. టెలికాం, ఐటీ షేర్లు డీలాపడటంతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు తగ్గి 83.33 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.35% తగ్గి 88.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సూచీల జోరుతో మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.8.48 లక్షల కోట్లు పెరిగి రూ.401.37 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 1,363.95 పాయింట్లు లాభపడింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,957.57 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరులో 74,121.61 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కొంత లాభాల స్వీకరణ జరగడంతో, చివరకు 114.49 పాయింట్ల లాభంతో 73,852.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.40 పాయింట్లు పెరిగి 22,402.40 దగ్గర స్థిరపడింది.

 • త్రైమాసిక ఫలితాల ప్రభావంతో ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ షేరు 2.71% నష్టపోయి రూ.577 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,311.57 కోట్లు తగ్గి రూ.83,131.37 కోట్లకు చేరింది.
 • వొడాఫోన్‌ ఐడియా ఫాలోఆన్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)లో మదుపర్లకు కేటాయించిన షేర్ల ట్రేడింగ్‌ గురువారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రూ.11 ప్రకారం ఈ షేర్లు కేటాయించిన నేపథ్యంలో, బుధవారం కంపెనీ షేరు 9.03% కోల్పోయి రూ.13.09 వద్ద ముగిసింది.
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 మెరిశాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.72%, టాటా స్టీల్‌ 2.73%, పవర్‌గ్రిడ్‌ 1.95%, కోటక్‌ బ్యాంక్‌ 1.64%, ఎన్‌టీపీసీ  1.34%, అల్ట్రాటెక్‌ 1.33%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.94% లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టైటన్‌ 1.17% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. లోహ 2.83%, కమొడిటీస్‌ 1.62%, పరిశ్రమలు 1.13%, చమురు-గ్యాస్‌ 0.96% రాణించాయి. ఐటీ, టెలికాం, టెక్‌ నిరాశపరిచాయి. బీఎస్‌ఈలో 2228 షేర్లు లాభాల్లో ముగియగా, 1594 స్క్రిప్‌లు నష్టపోయాయి. 107 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
 • ఇండస్‌టవర్స్‌లో వొడాఫోన్‌ వాటా కొనట్లేదు: ఎయిర్‌టెల్‌: టవర్ల నిర్వహణ సంస్థ ఇండస్‌ టవర్స్‌లో వొడాఫోన్‌ గ్రూప్‌నకు ఉన్న 21% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరపడం లేదని భారతీ ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. ఇండస్‌లో వాటా పెంచుకునే యోచన లేదని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ప్రస్తుతం ఇండస్‌ టవర్స్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు 47.95% వాటా ఉంది.
 • పేమెంట్‌ అగ్రిగేటర్‌గా వ్యవహరించేందుకు ఫిన్‌టెక్‌ సంస్థ పేయూకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. 2023 జనవరిలో పేయూ దరఖాస్తును తిరస్కరించిన ఆర్‌బీఐ, 120 రోజుల్లోగా మళ్లీ సమర్పించాలని ఆదేశించింది. తాజాగా అనుమతి లభించడంతో కొత్త మర్చంట్‌లను పేయూ చేర్చుకునే అవకాశం ఉంది.
 • ఇంటిగ్రేటెడ్‌ ఫ్లీట్‌ ఎలక్ట్రిఫికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ వెర్టెలో నుంచి 2000 ఎక్స్‌ప్రెస్‌-టీ విద్యుత్‌ సెడాన్‌ల సరఫరా ఆర్డరు దక్కించుకున్నట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రకటించింది. దశలవారీగా వెర్టెలోకు కార్లను డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది.
 • ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ పరిమాణం తగ్గింపు: ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) పరిమాణాన్ని ముందుగా అనుకున్న రూ.5000 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు తగ్గించింది. కంపెనీ ఈ ఐపీఓను మే మొదటి వారంలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా రూ.1000 కోట్ల విలువైన షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.2000 కోట్ల విలువైన వాటాలను విక్రయించనున్నారు. ఇందుకోసం సంస్థ విలువను దాదాపు రూ.13,500 కోట్లుగా లెక్కించినట్లు సమాచారం.
 • ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రవిశంకర్‌ పదవీకాలం పొడిగింపు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ టి.రవిశంకర్‌ పదవీకాలాన్ని ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రవిశంకర్‌ పునర్నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపిందని, 2024 మే 3 నుంచి ఏడాది పాటు పొడిగింపు ఉంటుందని వెల్లడించింది. 2021 మేలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఆయన చేరారు. 1990లో ఆర్‌బీఐలో చేరిన రవిశంకర్‌, పలు కీలక పదవులు నిర్వహించారు.
 • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవి కోసం రానా అశుతోష్‌ కుమార్‌ సింగ్‌ పేరును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవికి ఆశిష్‌ పాండే పేరును ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫారసు చేసింది. ప్రస్తుతం పాండే బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
 • ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీ ప్రారంభం: నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీలో డెరివేటివ్‌ కాంట్రాక్టులను ఎన్‌ఎస్‌ఈ బుధవారం తీసుకొచ్చింది. మార్కెట్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, దేశవ్యాప్తంగా సూచీ డెరివేటివ్స్‌లో 375 మందికి పైగా ట్రేడింగ్‌ సభ్యులు పాల్గొన్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఫ్యూచర్స్‌లో రూ.78.16 కోట్ల విలువైన 1,223 కాంట్రాక్టులు, ఆప్షన్స్‌లో రూ.1.55 కోట్ల విలువైన 1,724 కాంట్రాక్టులు ట్రేడయ్యాయి.
 • బహిరంగ మార్కెట్‌ లావాదేవీ ద్వారా లాజిస్టిక్స్‌ సంస్థ డెలివరీలో 2.8% వాటాను రూ.908 కోట్లకు కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ విక్రయించింది.
 • ప్రయాణికుల కార్ల విభాగంలోకి సంయుక్త సంస్థ ద్వారా అడుగుపెట్టేందుకు జపాన్‌ సంస్థ ఏఐఎస్‌ఐఎన్‌ గ్రూప్‌ కంపెనీస్‌తో ద్విచక్ర వాహనాలకు బ్రేక్‌ వ్యవస్థలను తయారు చేసే ఆస్క్‌ ఆటోమోటివ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని