అనధికారిక ఫారెక్స్‌ ట్రేడింగ్‌పై ఈడీకి నివేదించండి

బ్యాంకింగ్‌ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్‌ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది.

Published : 25 Apr 2024 02:04 IST

బ్యాంకులను ఆదేశించిన ఆర్‌బీఐ

ముంబయి: బ్యాంకింగ్‌ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్‌ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. అటువంటి కేసులను వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి నివేదించాలని ఆర్‌బీఐ తెలిపింది. అధిక రాబడి వస్తుందంటూ ఆశజూపి, దేశీయులకు కొన్ని అనధికారిక సంస్థలు ఫారెక్స్‌ వ్యాపార సౌకర్యాలను అందిస్తున్న సందర్భాలు తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ వివరించింది. అనధికారిక ఫారెక్స్‌ ట్రేడింగ్‌ను సులభతరం చేయడానికి.. ఈ సంస్థలు మార్జిన్‌, పెట్టుబడి, ఛార్జీలు తదితర వాటి కోసం నగదును వసూలు చేయడానికి,¨ వివిధ బ్యాంకు శాఖల్లో ఖాతాలు తెరిచే స్థానిక ఏజెంట్లను ఆశ్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఖాతాలను వ్యక్తులు, వ్యాపార సంస్థల పేరుతో తెరుస్తున్నారని, అలాంటి ఖాతాల్లోని లావాదేవీలు అనేక సందర్భాల్లో ఖాతా తెరవడానికి పేర్కొన్న ఉద్దేశానికి అనుగుణంగా ఉండట్లేదని గుర్తించినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ బదిలీ, చెల్లింపు గేట్‌వేల వంటి దేశీయ వ్యవస్థలను ఉపయోగించి అనధికారిక ఫారెక్స్‌ లావాదేవీలను చేపట్టడం కోసం ఈ సంస్థలు నివాసితులకు నిధులను రూపాయల్లో చెల్లించడానికి/జమ చేయడానికి ఆప్షన్లు ఇస్తున్నట్లు గమనించామని ఆర్‌బీఐ వెల్లడించింది. అందుకే అనధికారిక ఫారెక్స్‌ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి, ఆ వివరాలను వెంటనే ఈడీకి నివేదించాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు