కోటక్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కొరడా

ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలకు పూనుకుంది.

Published : 25 Apr 2024 02:04 IST

ఆన్‌లైన్‌లో కొత్త ఖాతాదార్లను జతచేసుకోవద్దు
క్రెడిట్‌ కార్డులు జారీ చేయొద్దు
‘ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌’లో లోటుపాట్లే కారణం

ముంబయి: ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలకు పూనుకుంది. ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా కొత్త ఖాతాదార్లను జతచేసుకోవడంపై నిషేధం విధించింది. తాజాగా క్రెడిట్‌ కార్డులనూ జారీ చేయకూడదని ఆజ్ఞాపించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.

రెండేళ్లు పరిశీలించాకే: 2022, 2023 సంవత్సరాల్లో కోటక్‌ బ్యాంక్‌ ఐటీ వ్యవస్థలను ఆర్‌బీఐ  పరిశీలించింది. కొన్ని అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు విస్తృత స్థాయిలో, సరైన సమయానికి పరిష్కారం చూపడంలో కోటక్‌ బ్యాంకు విఫలమైనందునే, కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్‌బీఐ వివరించింది.

లోటుపాట్లు ఇందులో: ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, పాచ్‌ అండ్‌ చేంజ్‌ మేనేజ్‌మెంట్‌, వెండార్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సెక్యూరిటీ-డేటా లీక్‌ ప్రివెన్షన్‌ స్ట్రాటజీ, బిజినెస్‌ కంటిన్యుటీ-డిజాస్టర్‌ రికవరీ రిగర్‌ అండ్‌ డ్రిల్‌ తదితర అంశాల్లో తీవ్ర లోటుపాట్లు, నిబంధనల ఉల్లంఘన కనిపించిందని ఆర్‌బీఐ తెలిపింది. వీటిపై బ్యాంకు సమర్పించిన వివరాలు సరైనవి లేకపోవడం / తప్పుగా ఉండడం / పరిగణించదగ్గవిగా ఉండకపోవడంతో తాము ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఆర్‌బీఐ వివరించింది.

గత రెండేళ్లలో పలు సార్లు కోటక్‌ బ్యాంక్‌ ఆన్‌లైన్‌/డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఛానళ్లలో అవాంతరాలు ఏర్పడినట్లు ఆర్‌బీఐ గుర్తు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15న ఆ సేవల్లో తీవ్ర అంతరాయం కలగడంతో, వినియోగదార్లు ఇబ్బందుల పాలయ్యారని తెలిపింది. ఇటీవలి కాలంలో క్రెడిట్‌ కార్డుల్లో లావాదేవీలు సహా డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరుగుతున్నందున, ఐటీ వ్యవస్థలపై మరింత భారం పడుతున్నట్లు ఆర్‌బీఐ వివరించింది.

ఈ సేవల కొనసాగింపు: ప్రస్తుత వినియోగదార్లకు/క్రెడిట్‌ కార్డు వినియోగదార్లకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సేవలు యథాతథంగా కొనసాగుతాయి.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2023-24 ఆర్థిక సంవత్సర, మార్చి త్రైమాసిక ఫలితాలను మే 4న ప్రకటించాల్సిన తరుణంలో తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

కోటక్‌ ఏమందంటే: కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా ఐటీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐతో పనిచేయడం కొనసాగిస్తామని.. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమస్యలనూ పరిష్కరించుకుంటామని వెల్లడించింది. ప్రస్తుత వినియోగదార్లకు క్రెడిట్‌ కార్డు, మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌ సహా అన్ని సేవలను అవాంతరాల్లేకుండా అందిస్తామని స్పష్టం చేసింది. కొత్త వినియోగదార్లను తీసుకోవడాన్ని మా శాఖలు కొనసాగిస్తాయని, అన్ని సేవలనూ (కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ మినహా) అందిస్తాయని తెలిపింది.

గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పైనా: 2020 డిసెంబరులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పైనా ఇదే తరహా చర్యలు ఆర్‌బీఐ తీసుకుంది. సాంకేతిక అవాంతరాలు తరచూ వస్తుండడంతో.. కొత్త కార్డుల జారీ, కొత్త డిజిటల్‌ సేవల ప్రారంభంపై నిషేధం విధించింది. తగిన మార్పులు చేపట్టాక, 2022 మార్చిలో ఆంక్షలను ఎత్తివేసింది.


భాజపాకు కోటక్‌ ప్రమోటరు రూ.60 కోట్ల విరాళం

దిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రమోటర్‌ గ్రూప్‌ ఇన్‌ఫినా ఫైనాన్స్‌ రూ.60 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను భారతీయ జనతా పార్టీ (భాజపా)కి విరాళంగా ఇచ్చింది. కోటక్‌ కుటుంబం ఆధీనంలో ఇన్‌ఫినా ఉంది. అయితే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఇన్‌ఫినా ఫైనాన్స్‌కు షేర్లు లేవు. ప్రస్తుతం కోటక్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ చర్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బీఎస్‌ఈ సమాచారం ప్రకారం.. 2024 మార్చికి ప్రమోటరు, ప్రమోటరు గ్రూప్‌ సంస్థలకు బ్యాంక్‌లో 25.89% వాటా ఉంది. ఉదయ్‌ కోటక్‌కు అత్యధికంగా 25.71% వాటా ఉంది. మిగతా 0.18% వాటా ప్రమోటరు గ్రూప్‌ సంస్థలకు ఉంది. ఎన్నికల సంఘానికి ఎస్‌బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2019, 2020, 2021లలో రూ.కోటి డినామినేషన్‌ గల రూ.60 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి.. భాజపాకు విరాళమిచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని