సంక్షిప్త వార్తలు(5)

ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్‌లు అందించే ఏసర్‌ గ్రూప్‌, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్‌ప్యూర్‌ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది.

Published : 17 May 2024 02:46 IST

ఏసర్‌ గృహోపకరణాలు

బెంగళూరు: ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్‌లు అందించే ఏసర్‌ గ్రూప్‌, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్‌ప్యూర్‌ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. గురువారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో 65 అంగుళాల టీవీతో పాటు ఎయిర్‌ సర్క్యూలేటర్‌ ఫ్యాన్‌లు, వాటర్‌ ప్యూరిఫయర్‌లు, వాక్యూమ్‌ క్లీనర్‌లు, హెయిర్‌ డ్రైయర్‌,  స్టైలర్‌లను కంపెనీ విడుదల చేసింది. డిక్సన్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంలో ఈ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయనున్నట్లు ఏసర్‌ ఇండియా అధ్యక్షుడు, ఎండీ హరీశ్‌ కోహ్లి పేర్కొన్నారు. ఎయిర్‌ సర్క్యూలేటర్‌ ఫ్యాన్‌లు కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేస్తాయని, ఉష్ణోగ్రతకు అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకునే వీటి ధర రూ.7,490 నుంచి ప్రారంభమవుతున్నట్లు వెల్లడించారు.


దేశీయ చమురుపై తగ్గిన పన్ను

దిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై అదాటు లాభాల పన్ను (విండ్‌ఫాల్‌ టాక్స్‌)ను టన్నుకు రూ.8,400 నుంచి రూ.5,700కు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం (ఎస్‌ఏఈడీ) రూపంలో ఈ పన్ను విధిస్తున్నారు. 2022 జులై 1న తొలిసారిగా ఈ పన్ను అమల్లోకి వచ్చింది.


ఇనెరా ప్రచారకర్తగా ధోని

ఈనాడు, హైదరాబాద్‌: జీవశాస్త్ర ఎరువులను అందించే బయోసైన్స్‌ సంస్థ ఇనెరా తన ప్రచారకర్తగా క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనిని నియమించుకుంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవశాస్త్ర ఎరువులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరుగుతోందని ధోని చెప్పారు.


జూన్‌ 11 కల్లా ఫలితాలు ప్రకటిస్తాం: బీసీజీ

హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సర 2, 3 త్రైమాసిక ఫలితాలను జూన్‌ 11 కల్లా ప్రకటించడం ద్వారా, తమ షేర్ల ట్రేడింగ్‌పై సస్పెన్షన్‌ అమలు కాకుండా చూస్తామని బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ (బీసీజీ) ప్రకటించింది. ఫలితాలు ప్రకటించనందున జూన్‌ 14 నుంచి బీసీజీ షేర్ల ట్రేడింగ్‌పై 15 రోజుల సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ బుధవారం నిర్ణయించిన నేపథ్యంలో, కంపెనీ గురువారం ఈ వివరణ ఇచ్చింది.


విస్తరణ ప్రణాళికల్లో దీసావాలా రబ్బర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణ, మౌలిక వసతుల సంస్థలకు అవసరమైన రబ్బరు ఉత్పత్తులను అందించే దీసావాలా రబ్బర్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణ ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే ఉన్న 3 ప్లాంట్లకు తోడుగా మరో 2 కొత్త ప్లాంట్లు నెలకొల్పుతోంది. తమ నాలుగో ప్లాంటును రూ.40 కోట్లతో ప్రారంభించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హునేద్‌ దీసావాలా గురువారం ఇక్కడ వెల్లడించారు.40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్లాంటుతో, ఉత్పత్తి సామర్థ్యం 7-8 టన్నుల నుంచి 25 టన్నులకు చేరుతుందన్నారు. మరో ప్లాంటును వచ్చే ఏడాది రూ.40 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 200 మంది ఉద్యోగులున్నారని, కొత్తగా 100 మందిని తీసుకోబోతున్నట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ముర్తాజా దీసావాలా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్‌ సాధించామని, రెండేళ్లలో ఇది రెట్టింపు అవుతుందన్నారు. బెంగళూరు, చెన్నై, పుణేలలోనూ వ్యాపారాన్ని విస్తరించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే వాహన రంగానికి అవసరమైన రబ్బరు ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు తెలిపారు. ఫార్మా రంగంలోని పరిశ్రమలకూ సిలికాన్‌ ఉత్పత్తులను అందిస్తామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని