ఎం అండ్‌ ఎం లాభం రూ.2,754 కోట్లు

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో  రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 17 May 2024 02:47 IST

డివిడెండ్‌ 422%

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో  రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.2,637 కోట్లతో పోలిస్తే ఇది 4% ఎక్కువ. ఆదాయం రూ.32,456 కోట్ల నుంచి 9% పెరిగి రూ.35,452 కోట్లకు చేరింది.

  • 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.11,269 కోట్లకు చేరింది. 2022-23 నాటి రూ.9,025 కోట్లతో పోలిస్తే, ఇది 25% అధికం. ఆదాయం రూ.1,21,362 కోట్ల నుంచి 15% పెరిగి రూ.1,39,078 కోట్లకు చేరింది.
  • ‘మా వ్యాపారాలు మంచి పని తీరు ప్రదర్శించడంతో అద్భుతమైన ఏడాదిని చూశాం. వాహన విభాగం అధిక వృద్ధి నమోదు చేసింది. వ్యవసాయ విభాగమూ మంచి వాటా పొందింది. మహీంద్రా ఫైనాన్స్‌ ఆస్తుల నాణ్యత పెరిగింద’ని ఎం అండ్‌ ఎం ఎండీ, సీఈఓ అనీశ్‌ షా వెల్లడించారు.
  • రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.21.10 (422%) చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.
  • వచ్చే మూడేళ్లలో విద్యుత్‌ వాహనాల (ఈవీల) కోసం మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఆటోమొబైల్‌ లిమిటెడ్‌ (ఎంఈఏఎల్‌)లో రూ.12,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

మరికొన్ని వివరాలు

  • సమీక్షా త్రైమాసికంలో వాహన విభాగ ఏకీకృత ఆదాయం 22% పెరిగి రూ.20,908 కోట్లకు, 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో 24% పెరిగి రూ.76,156 కోట్లకు చేరింది.
  • ఎం అండ్‌ ఎం వాహన విక్రయాలు 1,89,227 నుంచి 14% పెరిగి 2,15,280కు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 18% పెరిగి 8,24,939గా నమోదయ్యాయి. 2022-23లో ఇవి 6,98,456గా ఉన్నాయి.
  • ట్రాక్టర్ల విక్రయాలు 89,128 నుంచి 20% తగ్గి 71,039కు పరిమితమయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 4,03,981 నుంచి 7% తగ్గి 3,74,955కు పరిమితమయ్యాయి.
  • 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2029 జూన్‌ 24 వరకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓ (వాహన, ఫార్మ్‌ సెక్టార్‌), పూర్తి కాల డైర్టెకర్‌గా రాజేశ్‌ జెజురికర్‌ పునర్నియామకానికి బోర్డు ఆమోదం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని