42 కోట్ల మంది గగన విహారం!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది.

Published : 17 May 2024 02:48 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై ఇక్రా అంచనాలు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. 2023-24లో దేశీయ మార్గాల్లో ప్రయాణించిన 37.64 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 8-11% అధికం. విరామం కోసం, వృత్తి-వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా జరుగుతుండటం, కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తుందని పేర్కొంది. కరోనా పరిణామాల ముందునాటి ప్రయాణికుల సంఖ్య కంటే 10% అధికంగా 2023-24లో 37.64 కోట్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారని గుర్తు చేసింది.

కరోనా ముందు కన్నా అధికమే: ఎంపిక చేసిన విమానాశ్రయ ఆపరేటర్లందరి ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15-17% పెరగొచ్చని ఇక్రా అంచనా వేస్తోంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ఆధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్‌, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ లెక్కలు వేసింది. ‘ఇతర దేశాలతో పోలిస్తే భారత విమానాశ్రయ ప్రయాణికుల రద్దీ మెరుగ్గా పుంజుకుంది. 2023 క్యాలెండర్‌ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్‌ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. కరోనాకు ముందుతో పోలిస్తే 2023లో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 96% రికవరీ అయ్యింది. దేశీయ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ మాత్రం 106% రికవరీ అయింది. ఇందుకు కొత్త మార్గాలు, బలమైన ఆర్థిక వృద్ధి సహకరించాయ’ని ఇక్రా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని