నరేశ్‌ గోయెల్‌ భార్య అనిత కన్నుమూత

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌ భార్య అనిత గోయెల్‌(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు.

Published : 17 May 2024 02:49 IST

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయెల్‌ భార్య అనిత గోయెల్‌(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె కొద్ది కాలంగా క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఒక వెలుగు వెలిగేలా చేయడంలో, అనిత కూడా కీలక పాత్ర పోషించారు. గోయెల్‌ దంపతులకు కుమార్తె నమ్రత, కుమారుడు నివాన్‌ ఉన్నారు. భార్య తుదిశ్వాస విడిచే సమయంలో నరేశ్‌ పక్కనే ఉన్నారు. గురువారం మధ్యాహ్నం జరిగిన అనిత అంత్యక్రియలకు కుటుంబ స్నేహితులైన అనిల్‌ అంబానీ, షబానా అజ్మీ, జావేద్‌ అక్తర్‌తో పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ ఉద్యోగులు హాజరయ్యారు.

25 ఏళ్లపాటు కార్యకలాపాలు జరిపిన జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో నిలిచిపోయింది. కంపెనీలో అనిత నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌, బోర్డు సభ్యురాలిగా సేవలందించారు. రెవెన్యూ మేనేజ్‌మెంట్‌, నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ వంటి కీలక విభాగాలకు ఇంఛార్జిగానూ పనిచేశారు. బోయింగ్‌, ఎయిర్‌బస్‌ ప్రతినిధులతో సమావేశాలూ ఆమె ఆధ్వర్యంలో సాగేవని ఒక మాజీ ఉద్యోగి తెలిపారు. 2023లో గోయెల్‌ దంపతులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీ లాండరింగ్‌ కేసును చేసింది. జైలులో ఉన్న నరేశ్‌ గోయెల్‌ కూడా క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ, రెండు నెలల మధ్యంతర బెయిలులో ఉన్నారు. కంపెనీ కూడా దివాలా ప్రక్రియలో ఉంది. విజయవంతమైన బిడ్డరుకు ఈ కంపెనీని అప్పగించడంలో, న్యాయపరమైన చిక్కులు ఇంకా తొలగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని