వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!

మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌) అంచనా వేసింది.

Published : 17 May 2024 02:51 IST

2024-25పై ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో అంచనా

దిల్లీ: మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌) అంచనా వేసింది. అంతకుముందు ఏడాది కంటే 2023-24లో ఎగుమతులు 3% తగ్గి 437 బి.డాలర్లు (సుమారు రూ.36.27 లక్షల కోట్లు)గా నమోదైన సంగతి తెలిసిందే. 2024-25లో వస్తువుల ఎగుమతులు 500-510 బి.డాలర్లు, సేవల ఎగుమతులు 390-400 బి.డాలర్ల (సుమారు రూ.32.37-33.20 లక్షల కోట్ల) మేర నమోదు కావొచ్చని ఫియో అధ్యక్షుడు అశ్వినీ కుమార్‌ పేర్కొన్నారు. సంప్రదాయ మార్కెట్లయిన అమెరికా, ఐరోపా దేశాల్లో గిరాకీ పెరగడంతో, మన ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తోందని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌, ఇంజినీరింగ్‌, ఔషధ ఎగుమతులు బాగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

చైనా దిగుమతులపై దృష్టి సారించాలి: చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని అమెరికా భారీగా పెంచుతున్న నేపథ్యంలో, చైనా నుంచి మన దేశానికి వస్తువుల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని ఫియో పేర్కొంది. ప్రధానంగా విద్యుత్‌ వాహనాల వంటివి మన విపణిలోకి అధికంగా రావొచ్చని అభిప్రాయపడింది. దేశీయ పరిశ్రమను కాపాడేందుకు చైనా దిగుమతులపై ప్రభుత్వం, పరిశ్రమ దృష్టి సారించాల్సి అవసరం ఉందని అశ్వినీ కుమార్‌ తెలిపారు. చైనా నుంచి భారీగా దిగుమతులు (డంపింగ్‌) జరిగే పరిస్థితి ఏర్పడితే, ఇక్కడి వ్యాపారాలను కాపాడేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌) జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని